»Telangana Priyanka Gandhi To Visit Hyderabad On May 8
Revanth Reddy బల ప్రదర్శనకు సిద్ధం.. 8న తెలంగాణకు ప్రియాంకా గాంధీ
సభను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎందుకంటే తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభకు భారీ ఎత్తున నిరుద్యోగులు, ప్రజలను తరలించాలని రేవంత్ వర్గం భావిస్తున్నది. ఈ సభతో బల ప్రదర్శన చేయాలని రేవంత్ వర్గీయులు నిర్ణయించినట్లు సమాచారం.
రాష్ట్రం ఇచ్చినా అధికారంలోకి రాలేకపోయినా కాంగ్రెస్ పార్టీ (C0ngress Party) వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. పార్టీ బలంగా ఉన్నా నాయకుల మధ్య ఐక్యత లేక ప్రజాక్షేత్రంలోకి హస్తం పార్టీ చేదు ఫలితాలు ఎదుర్కొంటోంది. ఇప్పుడిప్పుడే ఆ లోపం నుంచి పార్టీ బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి నిరుద్యోగ నిరసన సభలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. టీఎస్ పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీలపై కాంగ్రెస్ పార్టీ (TPCC) ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరిగే ఈ సభకు పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరు కానున్నారు.
ప్రశ్నాపత్రాల లీకేజ్ ను కాంగ్రెస్ అధికార పార్టీపై అస్త్రంగా చేసుకుని ఉద్యమం చేపట్టింది. ఇప్పటికే మహబూబ్ నగర్ (Mahabub Nagar)తో ఇతర జిల్లాల్లో ఈ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈనెల 8వ తేదీన హైదరాబాద్ సరూర్ నగర్ (Saroor Nagar)లో నిరుద్యోగ నిరసన సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi Vadra) హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ సభల నిర్వహణపై మొదటి నుంచి పార్టీ భేదాభిప్రాయాలు వచ్చాయి. నల్లగొండలో నిర్వహించాల్సిన సభపై తమకు సమాచారం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు తెలిపారు. వారి అభ్యంతరంతో వాస్తవంగా నిర్ణయించిన తేదీకి కాకుండా సభ వాయిదా పడింది. నల్లగొండ నాయకులతో చర్చించి సభ తేదీ ప్రకటిస్తారు. ఈ సభకు ప్రియాంకను తీసుకొస్తానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.
కాగా సరూర్ నగర్ మైదానంలో జరిగే సభను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎందుకంటే తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభకు భారీ ఎత్తున నిరుద్యోగులు, ప్రజలను తరలించాలని రేవంత్ వర్గం భావిస్తున్నది. ఈ సభతో బల ప్రదర్శన చేయాలని రేవంత్ వర్గీయులు నిర్ణయించినట్లు సమాచారం. తరచూ సీనియర్ల అలకలు, సహకరించకపోవడం వంటి వాటితో విసుగెత్తిన రేవంత్ ఈ సభ ద్వారా ప్రియాంక, ఏఐసీసీ నాయకుల ముందు తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సభను విజయవంతం చేసి పార్టీపై పట్టు సాధించాలనే కసితో ఉన్నారు. హైదరాబాద్ లో పార్టీకి ఉత్సాహం నింపేందుకు కూడా ఈ సభ దోహదం చేస్తుంది.