శంషాబాద్ నుంచి బాటసింగారం వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాను ఏమి టెర్రరిస్టును కాదని, తనను ఎందుకు అడ్డుకుంటారని పోలీసులను నిలదీశారు. ఆ క్రమంలో కిషన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, పలువురు బీజేపీ నేతలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వానికి వందల కోట్లు ఇచ్చిందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఆ నిధులను ఉపయోగించి కట్టిన ఇళ్లను పేదలకు పంచాలని నిలదీశారు. ఆ డబుల్ బెడ్ రూం ఇళ్లు చూసేందుకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు దక్కేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు రఘునందన్ రావు, పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.