ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ టైటాన్స్(GT) తమ మొదటి రెండు సీజన్లలో ఫైనల్కు చేరిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2023(IPL 2023) క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్(MI) జట్టును నిన్న (మే 26న) 62 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్లో చోటు దక్కించుకుంది.
ఐపీఎల్ 2022లో నేరుగా ఫైనల్ చేరేందుకు క్వాలిఫయర్ 1లో రాజస్థాన్ రాయల్స్(RR)ను గుజరాత్ టైటాన్స్ ఓడించింది. కానీ ఐపీఎల్ 2023లో చెన్నైలో జరిగిన క్వాలిఫైయర్ 1లో ఓడిపోయి 173 పరుగులను ఛేజ్ చేయడంలో విఫలమవడంతో మళ్లీ ఈ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. ఇక తప్పక గెలవాల్సిన క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ జట్టు 233 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. దీంతో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టు 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రధానంగా శుభ్మాన్ గిల్(shubman gill) 60 బంతుల్లో 129 రన్స్ చేసి అదిరిపోయే స్కోర్ చేశాడు. సాయి సుదర్శన్ 43, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేసి జీటీ స్కోర్ పెరగడంతో దోహదం చేశారు. ఇక తర్వాత ఆటకు దిగిన ముంబై ఆటగాళ్లు భారీ స్కోర్ ను అధిగమించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) 61, తిలక్ వర్మ 43, కామెరాన్ గ్రీన్ 30 మినహా మిగతా ఆటగాళ్లు పెద్దగా స్కోర్లు చేయలేదు. దీంతో ముంబై టీం 171 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ 5 వికెట్లు పడగొట్టి వావ్ అనిపించాడు. దీంతోపాటు రషీద్ ఖాన్ 2, షమీ 2, జాషువా లిటిల్ 1 వికెట్లు తీసి గుజరాత్ గెలుపునకు కీలక పాత్ర పాషించారు.
ఐపీఎల్ చరిత్రలో ఓపెనింగ్ మ్యాచ్లో ఆడిన జట్లు..గుజరాత్ టైటాన్స్(GT), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మళ్లీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. GT సీజన్ ఓపెనర్లో CSKని అహ్మదాబాద్లో ఓడించింది. అదే వేదికైన నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు జట్లు ఫైనల్లో ఆడనున్నాయి. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.