Lucknow court: లక్నో సివిల్ కోర్టు బయట కాల్పులు కలకలం రేపాయి. కోర్టు ఆవరణలో దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. గ్యాంగ్ స్టర్ సంజీవ్ జీవా (Sanjeev Jeeva) అక్కడికక్కడే చనిపోయాడు. మరో బాలిక సహా కానిస్టేబుల్ గాయపడ్డారు. దుండగులు లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో క్రిమినల్ గ్యాంగ్ మెయింటెన్ చేస్తుంటాడు జీవా (Sanjeev Jeeva). అతనిపై కేసులు ఉండటంతో ఈ రోజు కోర్టుకు వచ్చారు. కాల్పులు జరిపిన దుండగులు తప్పించుకొని పోయారు. కాల్పులు జరిగిన తర్వాత కోర్టు ఆవరణలో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.
సంజీవ్ జీవా (Sanjeev Jeeva) వివాదాస్పద నేత ముఖ్తార్ అన్సారీకి సన్నిహితుడు. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో అన్సారీ నిందితుడు కాగా.. సహా నిందితుడిగా జీవాపై కేసు ఉంది. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ పోలీస్ కస్టడీలో హత్యకు గురైన రెండు నెలల్లో మరో గ్యాంగ్ స్టర్ హత్యకు గురవడం చర్చకు దారితీసింది. హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య అన్నారు. దోషులను వదిలిపెట్టబోం అని చెప్పారు. యూపీలో శాంతి భద్రతల పరిస్థితి గురించి ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమేనా..? భద్రత ఉండాల్సిన చోట హత్యలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.