ఫోన్లో మాట్లాడుతూ పొరపాటున కరివేరు పువ్వును నోట్లో పెట్టుకుని నమిలిందో యువతి. యూకేకి పయనం అవ్వాల్సిన ఆమె ఇక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడున్నాయి.
Young Woman Loses Life : ఫోన్లో మాట్లాడేటప్పుడు కొంత మంది ఏం చేస్తారో? ఎటు నడుస్తారో? తెలియదు. అలా నడుస్తూ వెళ్లిపోతుంటారు. దారిలో కనిపించే పూలను కోయడం, ఆకులు తెంపడం లాంటివి చేస్తుంటారు. ఇలాగే ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ పొరపాటున కరివేరు పువ్వును తెంపి నమలడం మొదలుపెట్టింది. కొంచెం సేపటి తర్వాత అది కరివేరు పువ్వని(Arali Flower) తెలిసి వెంటనే దాన్ని బయటకు ఊసేసింది. అయినా ఆ పువ్వులోని విషం ఆమె శరీరంలోకి చేరిపోయి ప్రాణాలు తీసింది.
కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన సూర్య సురేంద్రన్(24)కు నర్సుగా యూకేలో ఉద్యోగం వచ్చింది. దీంతో కొచ్చి విమానాశ్రయానికి ఆదివారం చేరుకుంది. అయితే ఎయిర్పోర్టులో సూర్య ఉన్నట్లుండి స్పృహతప్పి పడిపోయింది. దీంతో అక్కడి సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించిందని వైద్యులు తెలిపారు.
ఆమె ఆదివారం విమానాశ్రయానికి వచ్చే ముందు స్నేహితులు, బంధువులతో ఫోన్లో మాట్లాడింది. అదే సమయంలో తాను కరివేరు పువ్వును పొరపాటున నమిలానని తెలిపింది. తర్వాత ఆ పువ్వు అని తెలిసి దాన్ని ఉమ్మేసినట్లు చెప్పింది. అయితే చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం చేశారు. ఆ నివేదికలో కరివేరు పువ్వు(Arali Flower) వల్ల ఆమె చనిపోయిందని తేల్చారు. దీంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.