Driving Licence : చేతులు లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన యువకుడు
చేతులు లేని ఓ యువకుడు రెండు కాళ్లతో డ్రైవింగ్ చేయడం నేర్చుకుని ఆర్టీఓ నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌ని కూడా పొందాడు. అది పొందడానికి అతడు ఎంతలా కష్ట పడ్డాడంటే...?
Driving Licence : పట్టుదల, చేయగలనన్న ఆత్మ విశ్వాసం ఉండాలే గాని మనం చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని చేతులు లేని ఓ వ్యక్తి నిరూపించాడు. తనకు చేతులు లేకపోతేనేమి? కాళ్లతో కార్ డ్రైవింగ్ చేయడం నేర్చుకున్నాడు. నిరంతరం ప్రాక్టీస్ చేసి దానిలో పర్ఫెక్షన్ తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే ఆర్టీఓ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందాడు.
థాన్సేన్ అనే వ్యక్తికి 30 ఏళ్లు. చెన్నైలో(CHENNAI) నివాసం ఉంటాడు. అతనికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు విద్యుదాఘాతం వల్ల రెండు చేతుల్నీ పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి తన సాటి స్నేహితులందరికీ డ్రైవింగ్ లైసెన్స్‌లు(DRIVING LICENCE) వస్తుండటంతో తానూ సంపాదించాలని అనుకున్నాడు. అయితే అతడికి రెండు చేతులూ లేకపోవడంతో కాళ్లతో కారు నడపడం ప్రాక్టీస్ చేశాడు.
ఒక కాలుతో స్టీరింగ్‌ని కంట్రోల్ చేస్తూ, మరో కాలుతో కిందున్న బ్రేకులు, యాక్సలేటర్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నాడు. కేకే నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తాను డ్రైవింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకున్నాడు. తర్వాత ఆర్టీఓ పెట్టిన డ్రైవింగ్ పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడికి డ్రైవింగ్ లైసెన్స్(DRIVING LICENCE) వచ్చింది. అలా తన కలను ఈ చేతులు లేని యువకుడు నెరవేర్చుకున్నాడు.