Wall Collapse in Hyderabad : హైదరాబాద్లోని పలు చోట్ల మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, భారీ వర్షం ధాటికి బాచుపల్లిలో గోడ(WALL) కూలిపోయి ఏకంగా ఏడుగురు మరణించారు. అక్కడి రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ ఘటనలో మృతి చెందిన వారంతా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కూలీలని పోలీసులు వెల్లడించారు. నిర్మాణ పనుల(construction works) కోసం వారు అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చారని తెలిపారు. మృతుల్ని రాజు, శంకర్, ఖుషి, రామ్ యాదవ్, తిరుపతి రావు, హిమాన్షు, గీతాలుగా గుర్తించినట్లు తెలిపారు. చనిపోయిన వారిలో ఓ మహిళ, నాలుగేళ్ల పాప కూడా ఉన్నారు.
ఈ విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో (HYDERABAD) మరో రెండు రోజుల పాటు వర్షాలు(RAINS) పడే అవకాశాలు ఉండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.