టెక్నాలజీ(Technology) మారుతున్న కొద్దీ ఆ టెక్నాలజీని వాడుకుని మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలు(Cyber Crimes) రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ ఉంటే చాలు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) రెచ్చిపోయి నేరాలకు పాల్పడుతున్నారు. ఖాతాదారులకు తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం అయిపోతున్నాయి. సామాన్య ప్రజలకు సైబర్ క్రైమ్స్(Cyber criminals) గురించి అంతగా అవగాహన లేకపోవడం వల్ల ఈ నేరాలు ఎక్కువవుతున్నాయి.
తాజాగా అధిక పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరు దేశవ్యాప్తంగా రూ.712 కోట్లను దోపిడీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు ముంబై, లక్నో, గుజరాత్, హైదరాబాద్ల నుంచి ఉన్నట్లు పేర్కొన్నారు. దుబాయ్ చైనా మోసగాళ్లతో వీరికి పెట్టుబడుల సంబంధాలు కలిగి ఉన్నాయని పోలీసులు శనివారం ఇక్కడ తెలిపారు. పెట్టుబడులకు అధిక రాబడి ఇస్తామని ప్రజలను మోసగించిన నిందితులను 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.