Manipur Riots: మణిపుర్ విధ్యంసం వెనుక అసలు కారణాలు ఏంటి?
మణిపూర్‌లో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇప్పటికి 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాల్లు చేదాటిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఈ రెండు తెగలకు సంబంధించిన ఈ వివాదాలేనని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
Manipur Riots: మణిపూర్ హింసాత్మక ఆందోళనలు గత రెండు నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసపై ఇప్పటి వరకు 6 వేల కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇంత పెద్ద గొడవకు అసలు కారణమెంటని దేశం మొత్తం మణిపూర్ వైపు చూస్తోంది. అయితే భారతదేశానికి ఉత్తరంగా హిమలయాలు(Himalayas) ఎంత సౌందర్యంగా ఉంటాయో.. ఈశాన్య రాష్ట్రాలు కూడా అంతే ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అందుకే మణిపూర్ ను భారతీయ స్విట్జర్లాండ్(Indian Switzerland) అని పిలుస్తారు. అందమైన లోయాలతో చుట్టు ఎత్తైన కొండలతో ఎంతో అందంగా ఉండే ఈ రాష్ట్రం కొద్ది నెలలుగా యుద్ధ పరిస్థితులను నెలకొల్పుతోంది. స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులకు లోనౌతున్నారు. అయినా సరే ఈ అల్లర్లు రోజుకింత పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.
ఈ అలజడులకు ముఖ్య కారణం ఈ ప్రదేశంలో నివసించే కుకీ, మైతేయ్(Cookie, Meitei) తెగల మధ్య అంతర్యుద్ధమే. గత రెండు నెలలుగా సాగుతున్నా ఇప్పటికీ చల్లారని మంటలకు ప్రధాన కారణం మైతేయ్ తెగను ఎస్టీలుగా గుర్తించాలన్న డిమాండ్. దీన్ని ఇతర ఆదివాసీ తెగలు ముఖ్యంగా కుకీ తెగలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మైతేయ్‌లను ఎస్టీల్లో చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ మే 3న మణిపుర్ అఖిల ఆదివాసీ విద్యార్థి సంఘం (ఏటీఎస్యూఎం) చురచంద్‌పుర్‌లో భారీ ఆందోళనకు పిలుపునివ్వటంతో ఈ గొడవకు బీజం పడింది. అయితే మైతేయ్‌లు ఎందుకు ఎస్టీ హోదాను కోరుకుంటున్నారు. దాన్ని ఇతర ఆదివాసీ తెగలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలుసుకుందాం.
మణిపుర్(Manipur) రాష్ట్రంలో నివసించే తెగలలో అతిపెద్ద వర్గం మైతేయ్‌లు. రాజధాని ఇంఫాల్‌లోనూ, రాష్ట్ర రాజకీయాల్లో(politics)ను చివరికి ముఖ్యమంత్రి పదవి కూడా వారిదే. అందుకే వీరిని మణిపురీలు అని కూడా పిలుస్తుంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో వీరు 65 శాతం దాకా ఉంటారు. కానీ రాష్ట్రంలోని భూమిలో 10శాతం మాత్రమే వీరి చేతుల్లో ఉంది. అంటే లోయ లోయప్రాంతాల్లోని భూమి మాత్రమే వీరిది. కొండ ప్రాంతంలో ఉన్న భూమి వీరిది కాదు. కనీసం అక్కడ భూమిని కొనడానికి కూడా వీరికి చట్టం లేదు. వీరు కాకుండా నాగాలు, కుకీలు రాష్ట్రంలో బలమైన ఆదివాసీ తెగలు. 90 శాతం మణిపుర్ భూమి వీరి చేతుల్లోనే ఉంది. మైతేయ్ల్లో చాలామటుకు హిందువులు. నాగాలు, కుకీ-జోమీ(Nagas, Kuki-jomi)లు క్రిస్టియన్లు. జనాభాలో మెజార్టీ ఉండడం వలన మణిపూర్ అసెంబ్లీలో కూడా మైతేయ్ వర్గానికే పెద్దపీట వేస్తుంది. ఎందుకంటే 60 సీట్లున్న అక్కడి శాసనసభలో 40 సీట్లు వీరు అధికంగా ఉన్న ఇంఫాల్ లోయ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని నాగా, కుకీ-జోమీ ఆదివాసీల్లోని 34 తెగలను ఎస్టీలుగా ప్రభుత్వం గుర్తించింది. మైతేయ్‌లు ఇందులో లేరు. కానీ బయటి నుంచి శరణార్థులు, అక్రమ మార్గాల్లో రాష్ట్రంలోకి భారీగా వస్తున్న వలసల నుంచి రక్షణకుగాను తమకు కూడా ఎస్టీ హోదా కల్పించాలని చాలాకాలంగా వీరు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంతే కాకుండా దేశంలోని ఏ ప్రాంతం వారైనా వచ్చి తాముంటున్న ఇంఫాల్ లోయ ప్రాంతంలో భూమి కొనొచ్చు కానీ, తమకు మాత్రం పర్వత ప్రాంతాల్లో భూమి కొనుక్కోవటానికి వీలులేకుండా పోయిందన్నది మైతేయ్‌ల మరో వాదన. ఇలా చేయడం వలన తమ ప్రాంతంలో వారే మైనార్టీలుగా మారుతారని ఆందోళన.
అయితే 1949 ముందు భారత్‌లో కలవడానికి వీరు ఎస్టీలుగా గుర్తింపు పొందేవారని ఆ హోదాను పునరుద్ధరించాలంటూ మైతేయ్ సంఘం మణిపుర్ హైకోర్టులో కేసు వేసింది. కేవలం రిజర్వేషన్ల కోసం కాదని, సంస్కృతిని, భాషను, భూమిని, తమ సంప్రదాయాలను కాపాడుకోవటం కోసం ఆదివాసీలుగా గుర్తింపును కోరుతున్నామని మైతేయ్ సంఘం వాదించింది. ఈ వాదనలతో మణిపూర్ హైకోర్టు ఏకీభవించింది. మైతేయ్‌ల డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించి నాలుగు వారాల్లో ఎస్టీ హోదా ఇచ్చి, కేంద్ర ప్రభుత్వానికి ఆ సిఫార్సు పంపించాలని గత ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీన్ని ఇతర ఆదివాసీలు ముఖ్యంగా కుకీలు, నాగాలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో మెజార్టీ వర్గంగా ఇప్పటికే మైతేయ్లదే రాజకీయంగా పైచేయిగా ఉందని వారు గుర్తుచేస్తున్నారు. పైగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో మణిపూర్ భాషను కూడా చేర్చారని, హిందువుల్లోని ఎస్సీ, ఓబీసీ హోదాలకున్న ప్రయోజనాలను మైతేయ్‌లు ఇప్పటికే అనుభవిస్తున్నారని, కాబట్టి వారికి ఎస్టీ హోదా ఇవ్వటం సరికాదని తమ నిరసన తెలుపుతున్నారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ… ఆదివాసీ విద్యార్థి సంఘం ఆందోళనకు పిలుపు ఇచ్చారు.
ఆ తరువాతి రోజు అంటే మే 4న కుకీ తెగకు చెందిన ఇద్దరి మహిళలను నగ్నంగా ఊరేగించడం(Parade the two women naked), సాముహిక అత్యాచారంతో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో 150 మంది దాకా మరణించారు. 60 వేల మంది నిరాశ్రయులయ్యారు. అనేక చర్చిలు, దేవాలయాలు బూడిదయ్యాయి. ఈ తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) వచ్చి ఇరు వర్గాలతో చర్చలు జరిపాక పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లు కన్పించినా, మళ్లీ విధ్వంసం రాజేసుకుంది. తాజాగా మహిళలపై లైంగిక దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో దేశ వ్యాప్తంగా మణిపూర్ అల్లర్లపై దృష్టి పడింది. రాష్ట్ర వివాదం కాస్త దేశ సమస్యగా రూపాంతరం చెందేలా కనిపిస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. మొత్తం 16 జిల్లాల్లో ఇప్పటికీ సగం జిల్లాలు హింసాత్మకంగానే ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో పోలీసులతో పాటు ఆర్మీ బలగాలను మోహరించి అల్లర్లు జరగకుండా చర్యలు చేపడుతున్నారని అధికారులు వెల్లడించారు.