Protest: ఈశాన్య రాష్ట్రం మణిపుర్ (Manipur)లో గత కొంతకాలంగా జరుగుతున్న అల్లర్ల(riots) గురించి తెలుసు. అయితే రెండు నెలల క్రితం జరిగిన ఓ అమానుషమైన ఘటన తాజాగా సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా(Naked women parade) ఊరేగించిన వీడియో యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రజలు గురువారం భారీ ర్యాలీ(Big Rally) నిర్వహించారు. మణిపుర్‌లోని చురచంద్పుర్ జిల్లాలో వేలాది మంది ప్రజలు నల్లదుస్తులు ధరించి నిరసన ప్రదర్శించారు. బాధిత మహిళలకు న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్థానికులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
వాస్తవానికి ఈ ఘటన మే 4వ తేదీన చోటుచేసుకుంది. కానీ నిన్న బుధవారం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో కన్పించింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (N Biren Singh) స్పందించారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు కారణమైన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని ట్వీట్ చేశారు. అయినా సరే రాష్ట్రమంతటా ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు.