రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నట్లు ఆస్పత్రి సంఘాలు వెల్లడించాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడం లేదని, ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆరోగ్య శ్రీ కింద రేపటి నుంచి రోగులను చేర్చుకోమని ఆస్పత్రి సంఘాలు ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపట్నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులతో గురువారం ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. నేడు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వ అధికారులు చర్చించింది. ఈ తరుణంలో తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చకపోవడంతో ఆరోగ్యశ్రీని రేపట్నుంచి నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా ఆరోగ్యశ్రీ చికిత్స ఫీజులను ఏపీ ప్రభుత్వం సరిగ్గా చెల్లించడం లేదు. అలాగే గత పదేళ్లుగా ప్యాకేజీ ధరలను కూడా పెంచకపోవడంతో పలు ఆస్పత్రులు ఆవేదన వ్యక్తం చేశాయి. ఆరోగ్యశ్రీ పథకంలో రోగులకు సంబంధించిన చికిత్సలపై ఫీజు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని మండిపడ్డాయి. రేపటి నుంచి ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా కొత్త కేసులను అడ్మిట్ చేసుకోమని వెల్లడించాయి.
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. రేపటి నుంచి ఈహెచ్ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించలేమని, తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ ఆరోగ్య శ్రీ సేవలు రోగులకు అందవని ఆస్పత్రి సంఘాలు స్పష్టం చేశాయి.