Breaking news today: ఢిల్లీ ఎక్సైస్ పాలసీ కేసులో (Delhi excise policy case) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మంగళవారం మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) అదుపులోకి తీసుకున్నది (ED arrests Hyderabad businessman Arun Ramachandra Pillai). ఈ వివాదాస్పద పాలసీని రూపొందించి, అమలు చేస్తున్నప్పుడు ఇతర నిందితులతో కలిసి సౌత్ గ్రూప్ తరఫున పిళ్లై ప్రాతినిథ్యం వహించాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు (Delhi Liquor Scam) సంబంధించి కీలక నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైని గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈడీ అదికారులు ప్రశ్నించారు. అప్పుడు ఆదివారం ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రశ్నించారు. ఆ రోజు రామచంద్ర పిళ్లైని హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. లిక్కర్ కేసులో ఆయన పాత్రపై ప్రశ్నించారు. ఈ విచారణలో పిళ్లై (Ramachandra Pillai) నుంచి కీలక సమాచారం రాబట్టినట్లుగా అప్పుడే వార్తలు వచ్చాయి. రాబిన్ డిస్టిల్లరీస్ పేరుతో వ్యాపారం చేస్తున్న రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో లింకులు ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు రామచంద్ర పిళ్లై పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇండో స్పిరిట్ తో పాటు.. కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి రూ.2.30 కోట్లు వసూలు చేసి, ఢిల్లీ పెద్దలకు ఇచ్చినట్లుగా ఈడీ అధికారులు అనుమానించారు. ఈ నేపథ్యంలో పిళ్లైని ఈడీ అధికారులు ఆరు నెలల క్రితమే విచారణకు పిలిచి, సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత జనవరిలో రూ.2.2 కోట్ల విలువ చేసే పిళ్లైకి చెందిన వట్టినాగులపల్లిలోని భూమిని ఈడీ సీజ్ చేసింది. ఆ తర్వాత పలువురిని విచారించింది… అరెస్టులు కూడా చేసింది. ఇప్పుడు పిళ్లైని అదుపులోకి తీసుకున్నది. లిక్కర్ స్కాం కేసులో (Liquor Scam) కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నాడు.
లిక్కర్ స్కాంలో అరుణ్ పిళ్లైతో పాటు అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ తదితరులు ఉన్నారు. అలాగే సమీర్, గీతిక మహేంద్రులకు చెందిన ఢిల్లీలోని రూ.35 కోట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ను కూడా ఈడీ సీజ్ చేసింది. అమిత్ అరోరాకు చెందిన మంగోళియాలోని రూ.7.6 కోట్ల రెసిడెన్షియల్ ప్రెమిసెస్ ను అటాచ్ చేసింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఈడీ సీజ్ చేసింది.
కొద్ది రోజుల క్రితం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఈ రోజు జైలులో విచారించనుంది. సిసోడియాకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20 వరకూ జ్యుడీషియల్ కస్టడి విధించిన విషయం తెలిసిందే. సిసోడియా బెయిల్ అభ్యర్థనపై ఈ నెల 10న విచారణ జరగనుంది. గత శనివారం సిసోడియా కస్టడీ పొడిగిస్తూ ఇచ్చిన గడువు ముగియడంతో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్పాల్ ఎదుట ఆయనను హాజరుపరిచారు. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి కోరారు సీబీఐ తరఫు న్యాయవాది. కోర్టు అందుకు అనుమతించింది. కోర్టులో తనను ధ్యానం గదిలో ఉంచాలనే అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్ కు కోర్టు సూచించింది. అలాగే, డైరీ, పెన్, భగవద్గీత, కళ్ళద్దాల కోసం సిసోడియా దరఖాస్తును కోర్టు అనుమతించింది.