తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై (tamil nadu bjp chief annamalai) డీఎంకే ఫైల్స్ (DMK files) పేరిట అధికార పార్టీ అక్రమాలను విడుదల చేశారు. తాను అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న తేదీన ఉదయం గం.10.15 సమయానికి డీఎంకే ఫైల్స్ విడుదల చేస్తానని ప్రకటించారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలు ఇందులో ఉంటాయని చెప్పారు. చెప్పినట్లుగానే అన్నామలై (annamalai) ఈ రోజు ఉదయం మీడియా ముందుకు వచ్చారు. 27 మంది డీఎంకే నేతల వద్దనే రూ.2 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇది తమిళనాడు జీడీపీలో 10 శాతం అన్నారు (tamil nadu gdp). ఇది కూడా ప్రత్యక్ష ఆస్తులు, కంపెనీలలో అధికార పార్టీ నేతల వాటాలు, వారు కలిగి ఉన్న ఆస్తుల విలువను మాత్రమే చెబుతున్నామని, ఇంకా దానిని దాటి వెళ్లలేదని చెప్పారు. డీఎంకే ఫైల్స్ పార్ట్ 1ను ఈ రోజు విడుదల చేస్తున్నానని, ఇది ఏడాది పొడవునా సిరీస్ గా సాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్టాలిన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
డీఎంకే నేతలు జగట్రచ్చాగన్, ఈవీ వేలు, కేఎన్ నెహ్రూ, కనిమొళి, కళానిధి మారన్, టీఆర్ బాలు, కలానిధి వీరసామి, దురైమురుగన్, కథీర్ అనంద్, ఆర్కోట్ వీరసామి, కళానిధి వీరసామి, కే పోన్ముడీ తదితరుల ఆస్తులను అన్నామలై బయట పెట్టారు. ఇందుకు సంబంధించి ఆయన వీడియోను ప్రదర్శించారు. వారి, వారి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వీడియో ద్వారా వెల్లడించారు. స్క్రీనింగ్ అనంతరం అన్నామలై డీఎంకేకు నాలుగు ప్రశ్నలను సంధించారు. 2006 – 2011 కాలంలో రెడ్ జెయింట్ సినిమాస్ రూ.300 కోట్లతో సినిమాలు తీశాయని, చాలా సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ వాటికి ఆదాయ వనరు ఏమిటో చెప్పాలన్నారు. ఆ తర్వాత స్టాలిన్ అల్లుడు శబరీషన్ తో జార్జ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీనివాస్ వెంకటేషన్ సంబంధాలపై నిలదీశారు.
మంత్రులు ఉదయనిధి స్టాలిన్, అన్బిల్ మహేష్ పొయ్యమొళి ఒకప్పుడు డైరెక్టర్లుగా ఉన్న సంస్థతో స్టాలిన్ ఎంవోయూ కుదుర్చుకున్నది వాస్తవం కాదా అని మూడో ప్రశ్న అడిగారు. టెండర్ ప్రక్రియపై కస్టమ్ డ్యూటీ విధించలేమని ఎగ్జిమ్ స్పష్టం చేసిన తర్వాత, మెట్రో ఫేజ్ 1 టెండర్‌తో కస్టమ్ డ్యూటీని ఎందుకు అనుబంధంగా చేర్చారని అడిగామని అన్నామలై సీఎం స్టాలిన్‌పై అవినీతి ఆరోపణ చేశారు. 2011 ఎన్నికల ప్రచారానికి లంచానికి ప్రతిఫలంగా అప్పటి డిఎంకె ప్రభుత్వం అమెరికన్ కంపెనీ ఆల్స్టోమ్ కు అనుకూలంగా వ్యవహరించిందన్నారు. దీనిపై సీబీఐలో ఫిర్యాదుదారుగా కేసు నమోదు చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, నేడు అంబేడ్కర్ జయంతి సందర్భంగా అన్నామలై ఈ రోజు రాజ్యాంగ నిర్మాత బ్యాడ్జితో మీడియా ముందుకు వచ్చారు. తాను ఈ రోజు డీఎంకే ఫైల్స్ మొదటి భాగం విడుదల చేశానని, వీటి పైన మీడియా ప్రశ్నలకు ఏప్రిల్ 20, 21వ తేదీల్లో అందుబాటులో ఉంటానని చెప్పారు.