ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం తర్వాత సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. సుదీర్ఘ చర్చలు, బుజ్జగింపుల అనంతరం సిద్ధరామయ్యనే సీఎంగా చేయాలని అధిష్టానం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది.
ఎట్టకేలకు కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రిగా (Chief Minister) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఖరారు అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం తర్వాత సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. సుదీర్ఘ చర్చలు, బుజ్జగింపుల అనంతరం సిద్ధరామయ్యనే సీఎంగా చేయాలని అధిష్టానం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. ఇక ప్రమాణస్వీకారం తేదీ కూడా ఖరారైంది. ఈ మేరకు కర్ణాటకలో చకచకా పరిణామాలు జరుగుతున్నాయి. కంఠీరవ మైదానంలో ఈనెల 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈనెల 10వ తేదీన జరిగిన కర్ణాటక ఎన్నికల్లో (Elections) 224 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) 135 ఎమ్మెల్యేలు గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే సీఎంగా ఎవరవుతారనే దానిపై వారం రోజులుగా తీవ్ర చర్చలు జరిగాయి. ఫలితాల నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీకి రాజకీయాలు మారాయి. పార్టీని ఒంటిచేత్తో గెలిపించిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్, సీనియర్ నాయకుడు, గతంలో సీఎంగా పని చేసిన సిద్ధరామయ్య మధ్య సీఎం పదవిని ఆశిస్తున్నారు. అధికార పీఠంపై తామే కూర్చోవాలని వీరిద్దరూ ఉడుం పట్టు పట్టారు. కానీ చివరకు డీకే శివ కుమార్ (DK Shivakumar) కొంత వెనకడుగు వేశారు. సోనియా, రాహుల్ తో పాటు మల్లికార్జున ఖర్గేలు మంతనాలు జరిపారు. వృద్ధ నాయకుడిగా ఉన్న సిద్ధరామయ్యకు ఇదే చివరి అవకాశం అనే భావనతో అతడికి అవకాశం ఇద్దామని సూచించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి డీకే పట్టు వీడారు. దీంతో వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. సిద్ధరామయ్యను సీఎంగా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయనుంది.
బెంగళూరులోని (Bengaluru) కంఠీరవ మైదానంలో శనివారం సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం (Oath) చేయనున్నారు. అంతకుముందు గురువారం రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్షం (Congress Legislative Party) సమావేశం కానుంంది. ఏకగ్రీవంగా సిద్ధరామయ్యను తమ నాయకుడిగా సీఎల్పీ నిర్ణయం తీసుకోనుంది. అనంతరం సీఎల్పీ తీర్మానాన్ని గవర్నర్ కు సమర్పిస్తారు. అన్ని సవ్యంగా సాగితే ఎల్లుండి కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం పరిణామాలు మరింత ఉత్కంఠగా మారుతాయి.