కళాతపస్వి కే విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు పితృ సమానులని, అలాంటి వ్యక్తి ఇక లేరని తెలిసి నమ్మలేకపోతున్నట్లు చెప్పారు. ఆయన గొప్పతనం గురించి మాటలు చాలవని, పండితులను, పామరులను కూడా ఒకేలా మురిపించే ఆయన సినిమాల శైలి ఎంతో విశిష్టమైనదన్నారు. ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ను కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకులు మరొకరు లేరన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచస్థాయికి తీసుకు వెళ్లారన్నారు. శుభలేక, స్వయంకృషి, ఆపద్భాంధవుడు చిత్రాల ద్వారా ఆయనతో నటించే అవకాశం దక్కిందన్నారు. తమ మధ్య గురుశిష్యుల బంధం ఉందని, అంతకుమించి తండ్రీకొడుకుల అనుబంధం ఉందన్నారు. కే విశ్వనాథ్‌తో గడిపిన క్షణాలు తనకు అత్యంత విలువైనదని, ప్రతి నటుడికి ఆయనతో పని చేయడం ఒక ఎడ్యుకేషన్ వంటిది అన్నారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం ఆ మహానీయుడి కళాకాండం శంకరాభరణం విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా మారిందన్నారు. ఆయన లేనిలోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగువారికి ఎప్పటికీ తీరనిది అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.
కళాతపస్వి కన్నుమూయటం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని బాలకృష్ణ అన్నారు. భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు ముఖ్యంగా తెలుగుదనాన్ని అణువణువునా ప్రతిబింబించేలా ఆయన అద్భుత చిత్రాలను తెరకెక్కించారన్నారు. ఇది తెలుగు సినిమాకే గర్వకారణమన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింప చేశారన్నారు. పరిశ్రమకే వన్నె తెచ్చారని, ప్రతి తెలుగువాడు గర్వించేలా చేసిన దిగ్గజం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన .. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి , తపస్సు కావించి, తనువు చాలించిన ఋషి… వెండితెరకి ఇకపై దొరకునా అటువంటి సేవ ! అంటూ కీరవాణి ట్వీట్ చేశారు.
భారతీయ సినిమా జీనియస్‌ను కోల్పోయిందని తెలంగాణ గవర్నర్ తమిళసాయి అన్నారు. మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విశ్వనాథ్ మృతి తెలిసి విచారం కలిగిందని వెంకయ్యనాయుడు అన్నారు. కళాతపస్వి నుండి తాను ఎంతో నేర్చుకున్నట్లు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు సజీవమని కమల్ హాసన్ అన్నారు.