Chikoti Praveen:థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ చేస్తూ అరెస్టైన చికోటి ప్రవీణ్ కుమార్‌కు బెయిల్ లభించింది. అతనితో ఉన్న 83 మందికి థాయ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. 4500 బాట్స్ (రూ.10,781) జరిమానా విధించడంతో పాటు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఫైన్ చెల్లించేవరకు ప్రవీణ్ పాస్ పోర్ట్ అధికారుల వద్దే ఉంచాలని ఆదేశించింది. జరిమానా చెల్లించడంతో ప్రవీణ్ తిరిగి హైదరాబాద్ రానున్నారు.
థాయ్‌లాండ్‌లో క్యాసినో ఆడుతూ ప్రవీణ్ సహా 93 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 14 మంది మహిళలు.. రాజకీయ నేతలు ఉన్నారు. పటాయాలో ఓ హోటల్ వద్ద గ్యాంబ్లింగ్ జరుగుతుందని తెలుసుకొని పోలీసులు రైడ్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, కోట్ల విలువ గల గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు.
డిటెక్టివ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సోమవారం తెల్లవారుజామున రైడ్ చేశారు. థాయ్‌లాండ్‌కు చెందిన మహిళలతో కలిసి చికోటి ప్రవీణ్ గ్యాంబ్లింగ్ డెన్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర చోట్ల నుంచి కూడా గ్యాంబ్లింగ్ కోసం తీసుకొచ్చారని సమాచారం.
పటాయాలో విలాసవంత హోటల్లో ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని తెలిసింది. జూదం కోసం సంపావో అనే సమావేశ గదిని అద్దెకు తీసుకున్నారని సమాచారం. భారీగా నగదు, గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు. 20.92 కోట్ల గేమింగ్ చిప్స్, 1.60 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.
అంతకుముందు చికోటి ప్రవీణ్ కుమార్‌పై (Chikoti Praveen) మనీ ల్యాండరింగ్ కేసు ఉంది. ప్రముఖులతో పరిచయాలు, పార్టీలు, గ్యాంబ్లింగ్ ఏర్పాటు చేయడంపై గతంలో ఈడీ అధికారులు ఆరా తీశారు.