కవిత కస్టడీ ముగియడంతోఆమెను కోర్టులో హాజరుపర్చారు. కస్టడీ పొడిగించారు. అయితే కోర్టులో కవిత మాట్లాడేందుకు జడ్జి అనుమతించలేదు. దీంతో ఆమె నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు.
MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజుతో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపర్చారు. మళ్లీ రెండు వారాల పాటు కవితకు కస్టడీ పొడిగించారు. అయితే కోర్టులో కవిత మాట్లాడేందుకు జడ్జి అనుమతించలేదు. దీంతో ఆమె నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. ఈ లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నేను తప్పు చేశాను అనడానికి ఆధారాల్లేవు. రెండున్నరేళ్ల విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
వేరే వ్యక్తుల స్టేట్మెంట్తో నన్ను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో నేను బాధితురాలిని. రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేలడం లేదు. వ్యక్తిగతంగా, రాజకీయంగా నా ప్రతిష్టను దిగజార్చారు. నా మొబైల్ నంబర్ అన్ని ఛానల్స్‌లో వేసి నా ప్రైవసీకి భంగం కలిగించారని కవిత ఆ లేఖలో తెలిపారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలతో పాటు ఇతర బిజినెస్ వివరాలను కూడా ఇచ్చానని కవిత అన్నారు. ఈ కేసులో విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నా కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని మళ్లీ కోరుతున్నని కవిత లేఖలో తెలిపారు.