»Brs Party Group Politics Exposed In Kt Rama Rao Bhupalpally Tour
BRS Dispute కేటీఆర్ సభలో గందరగోళం.. రాజుకున్న వివాదం
కేటీఆర్ పర్యటన ఆద్యంతం గందరగోళంగా మారింది. ఈ పరిణామాలపై కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై చర్యలు తీసుకునేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కాగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో మధుసూదనా చారి వర్గం అసంతృప్తితో ఉంది.
గులాబీ పార్టీ (BRS Party)లో అసంతృప్తులు పెరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటుతున్నా గుర్తింపు లేకపోవడం.. కొందరికే పదవులు దక్కడం.. కష్టపడే వారిని గుర్తించకపోవడం వంటివి కారు పార్టీలో కలవరం రేపుతున్నాయి. కాకపోతే ఈ అసంతృప్తులను బయటకు రాకుండా అధికార పార్టీ జాగ్రత్త పడుతోంది. కానీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అక్కడక్కడ బహిర్గతమవుతున్నాయి. ఎన్నికల వేళ అసంతృప్తులు అగ్నిపర్వతంలా బద్దలయ్యే అవకాశం ఉంది. దీనికి తాజాగా భూపాలపల్లి (Bhupalpally)లో జరిగిన కేటీఆర్ పర్యటన నిదర్శనంగా నిలుస్తున్నది.
ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally District)లో గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT Rama Rao) పర్యటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల (Double Bedroom House) ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమాలు కేటీఆర్ చేతులమీదుగా జరిగాయి. అనంతరం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. అయితే ఈ కేటీఆర్ పర్యటనలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. ప్రారంభోత్సవాలు మొదలుకుని బహిరంగ సభ వరకు స్థానిక పార్టీల నాయకత్వం బల ప్రదర్శన చూపించేందుకు ప్రయత్నించాయి.
జిల్లా కేంద్రం భూపాలపల్లిలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి (Sirikonda Madusudhana Chary), ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి (Gandra Venkata Ramana Reddy) మధ్య విబేధాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్రను పార్టీలోకి తీసుకోవడం మధుసూదనా చారికి నచ్చలేదు. పార్టీలో ఎమ్మెల్యే ఆగడాలు అధికమయ్యాయి. దీనికితోడు ఆయన సతీమణి జ్యోతి (Gandra Jyothi)కి కూడా జిల్లా చైర్మన్ పదవిని ఇచ్చారు. దీంతో గండ్ర ఆధిపత్యం కొనసాగుతోంది. కేటీఆర్ ముందు ఇది చూపించేందుకు ప్రయత్నించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) మాట్లాడుతున్న సమయంలో ‘జై చారి, జై సిరికొండ, చారి సాబ్ జిందాబాద్’ వంటి నినాదాలు వినిపించాయి. ప్రతిగా జై గండ్ర అనే నినాదాలు వచ్చాయి. మంత్రి ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు.
‘మీకు దండం పెడతా! ఆపండి. ఇది మన కార్యక్రమం. ప్రశాంతంగా జరగనివ్వండి’ అని ఎర్రబెల్లి పలుమార్లు బతిమాలాడాల్సి వచ్చింది. దీనికితోడు సభలో జై కాంగ్రెస్ అనే నినాదాలు కలకలం రేపాయి. ఇక గండ్ర వెంకట రమణారెడ్డి ప్రధానంగా వస్తున్న భూకబ్జా ఆరోపణలు బహిరంగ సభలో కూడా వచ్చాయి. కేటీఆర్ కు కబ్జాల విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చామని పలువురు బాధితులు తెలిపారు. రమణారెడ్డి తమ భూములు లాక్కొని దౌర్జన్యం చేస్తున్నాడని సభా వేదిక వద్ద బాధితులు వాపోయారు. కేటీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలా కేటీఆర్ పర్యటన ఆద్యంతం గందరగోళంగా మారింది. ఈ పరిణామాలపై కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై చర్యలు తీసుకునేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కాగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్ లు అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ప్రకటించడంతో మధుసూదనా చారి వర్గం అసంతృప్తితో ఉంది. ఈసారి టికెట్ తమ నాయకుడికి ఇవ్వకపోతే పార్టీని వీడేందుకు సిరికొండ వర్గం సిద్ధంగా ఉంది.