»Us President Joe Biden Nominates Ajay Banga As World Bank President
Ajay Banga అమెరికాలో భారతీయుడికి ప్రతిష్టాత్మక పదవి
వాతావరణ మార్పులతో సహా మన కాలంలోని అత్యంత అత్యవసర సవాళ్లను పరిష్కరించడానికి సంబంధించి పబ్లిక్- ప్రైవేట్ వనరులను సమీకరణలో అజయ్ కు అపారమైన అనుభవం ఉంది. క్లిష్ట సమయంలో ఉన్న ప్రపంచ బ్యాంక్ కు మార్గదర్శకత్వం చేసేందుకు అజయ్ కు ప్రత్యేక అర్హతలు ఉన్నాయి
ప్రపంచ దేశాల్లో భారతీయులు (Indians) సత్తా చాటుతున్నారు. వృతి, వ్యక్తిగత విషయాల్లో ఇతర దేశాలకు వలస వెళ్లిన భారతీయులు (NRIs) ఆ దేశాల్లో అత్యున్నత స్థాయికి చేరుతున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ లో భారతీయుల హవా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) భారతీయులపైనే అపార నమ్మకం ఉంచారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ (Kamala Harris) ఎన్నికతోనే భారతీయుల సత్తా ఏంటో తెలిసింది. బైడెన్ శ్వేత సౌధం (White House)లో ఉన్న అధికారుల్లో అత్యధికులు మనవారే ఉన్నారు. తన బృందంలో మన ఎన్నారైలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇక తాజాగా ప్రపంచంలోనే అత్యున్నత సంస్థకు జో బైడెన్ భారతీయుడినే నామినేట్ చేశారు. అంతలా ఆయన తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటంటే.. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగాను నామినేట్ చేశారు.
ప్రపంచ బ్యాంక్ (World Bank) అధ్యక్షుడిగా కొనసాగుతున్న డేవిడ్ మాల్ పాస్ త్వరలో పదవీ విరమణ చెందుతున్నాడు. ఆ పదవిలో మాస్టర్ కార్డ్ (Master Card) మాజీ సీఈఓ అజయ్ బంగా (63)ను (Ajay Banga) నామినేట్ చేస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్ కు అజయ్ నాయకత్వం (Leadership) వహిస్తారని పేర్కొన్నారు. అంతర్జాతీయ బ్యాంక్ లో అత్యధిక వాటా అమెరికాదే ఉండడంతో అధ్యక్షుడిని నామినేట్ చేసే అధికారం అమెరికాకు ఉంది. ఆయన నామినేషన్ ను ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఆమోదం తెలిపితే ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్ గా అజయ్ బంగా చరిత్ర సృష్టిస్తారు. దీంతోపాటు తొలి సిక్కు అమెరికన్ గా కూడా రికార్డు నెలకొల్పుతారు. మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ కంపెనీలను విజయవంతంగా నడిపించిన అనుభవం అజయ్ బంగాకు ఉంది. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మ శ్రీ (Padma Sri Award) పురస్కారం ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే బైడెన్ గురువారం ప్రకటన చేశారు.‘వాతావరణ మార్పులతో సహా మన కాలంలోని అత్యంత అత్యవసర సవాళ్లను పరిష్కరించడానికి సంబంధించి పబ్లిక్- ప్రైవేట్ వనరులను సమీకరణలో అజయ్ కు అపారమైన అనుభవం ఉంది. క్లిష్ట సమయంలో ఉన్న ప్రపంచ బ్యాంక్ కు మార్గదర్శకత్వం చేసేందుకు అజయ్ కు ప్రత్యేక అర్హతలు ఉన్నాయి’ అని బైడెన్ అజయ్ బంగాపై ప్రశంసలు కురిపించాడు.
అజయ్ నేపథ్యం
– ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా కాబోతున్న అజయ్ బంగా జన్మించింది మహారాష్ట్ర (Maharashtra)లోని పుణె సమీపంలో ఉన్న ఖడ్కీ కంటోన్మెంట్. 1959 నవంబర్ 10న జన్మించారు.
– ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో డిగ్రీ చదివారు. ఆర్థిక శాస్త్రం చదివాడు.
– అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లో పీజీపీ పట్టా పొందాడు.
– మాస్టర్ కార్డ్ సీఈఓగా 12 సంవత్సరాలు కొనసాగాడు.
– ప్రస్తుతం ఈక్వీటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ లో వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నాడు.