»Bio Asia 2023 All Set To Bio Asia Conference In Hyderabad
Bio Asia-2023: నేటి నుంచి హైదరాబాద్ లో అంతర్జాతీయ సమావేశం
జీవ శాస్త్ర రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను రానున్న ఐదేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ముందుకు వెళ్తోంది. ఈ సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు (Investments) ఆకర్షించాలని భావిస్తున్నది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశం జరుగనుంది. అంతర్జాతీయ సదస్సులకు కేంద్రంగా హైదరాబాద్ మారుతోంది. ఈ క్రమంలోనే జీవశాస్త్ర (Life Sciences), ఆరోగ్య రక్షణ (Health) రంగాలకు సంబంధించి ఆసియా (Asia)లోనే అతి పెద్ద వేదిక ‘బయో ఆసియా’ 20వ వార్షిక సదస్సు (Bio Asia 2023) కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సదస్సుపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు (KT Rama Rao) ప్రత్యేక శ్రద్ధ ఉంచారు. ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి తెలంగాణ (Telangana), హైదరాబాద్ శక్తిని చాటాలని ఆకాంక్షిస్తున్నారు.
బయో ఆసియా-2023 పేరిట నాణ్యమైన వైద్యం, అందరికీ ఆరోగ్యం లక్షంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హైదరాబాద్ లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ- HICC)లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మంత్రి కేటీఆర్ (KTR) సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్.. షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ హ్యుమనైజ్డ్ హెల్త్ కేర్’ అనే నినాదంతో జరుగుతున్న ఈ సదస్సులో ఆరోగ్య రంగాన్ని మరింత మానవీయంగా మార్చడంపై చర్చలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు జరగనున్నాయి. ఈ సదస్సుకు 50కి పైగా దేశాల నుంచి సుమారు 2,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సుమారు 800 కార్పొరేట్ సంస్థలు సదస్సులో పాల్గొంటున్నాయి. కాగా తొలిసారిగా ప్రఖ్యాత సంస్థ యాపిల్ (Apple) ఈ సదస్సులో పాల్గొంటోంది.
ఇక సదస్సులో నోవార్టిస్ (Noverties) సీఈఓ వాస్ నరసింహన్ కీలక ఉపన్యాసం చేయనున్నాడు. ఇక ఈ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లైఫ్ సైన్సెస్ రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ, మౌలిక వసతుల కల్పనపై పలు నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే ఫార్మా సిటీలో లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ప్రకటన చేయనుందని సమాచారం.
జీవ శాస్త్ర రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను రానున్న ఐదేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ముందుకు వెళ్తోంది. ఈ సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు (Investments) ఆకర్షించాలని భావిస్తున్నది. 2021 నాటికి తెలంగాణలో పని చేస్తున్న లైఫ్ సైన్సెస్ సంస్థల విలువ రూ.50 బిలియన్ డాలర్లు కాగా.. 2028 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరాలని లక్ష్యంగా విధించుకుంది. ప్రస్తుతం 4 లక్షలుగా ఉన్న ఉద్యోగులను ఈ రంగంలో 8 లక్షలకు పెరిగేలా చేయాలని మరో లక్ష్యం. ఈ సదస్సులో బయోటెక్, లైఫ్ సైన్సెస్ విభాగంలో స్టార్టప్ లకు పోటీలు నిర్వహిస్తున్నారు. సుమారు 400 స్టార్టప్ లు ఈ సదస్సులో ఆవిష్కరణకు దరఖాస్తు చేసుకోగా 75 స్టార్టప్ లను ఎంపిక చేశారు. వీటిలో ఐదింటికి అవార్డులు ఇవ్వనున్నారు.