TFCC Nandi Awards: మళ్లీ TFCC నంది అవార్డ్స్..దుబాయ్ లో వేడుక
టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్(TFCC Nandi Awards 2023) సౌత్ ఇండియా 2023 ఈ ఏడాది ఇవ్వనున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2021, 22 ఏడాదిలో విడుదలైన చిత్రాల వారు అప్లై చేసుకోవాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో `టీఎఫ్‌సీసీ(TFCC) నంది అవార్డ్స్(Nandi Awards) సౌత్ ఇండియా 2023` వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్బంగా `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` బ్రోచర్ ను ఈ రోజు ఫిలించాంబర్ లో ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే `ఆర్ఆర్ఆర్` సినిమాటోగ్రాఫర్ కె.కె సెంథిల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. విజయేంద్రపసాద్, కెకె.సెంథిల్ కుమార్, టియస్ ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, ప్రసన్న కుమార్, కెయల్ న్ ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, వంశీ, శ్రీశైలం, నటి శుభశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్(Nandi Awards) ని మళ్లీ ప్రతాని రామకృష్ణ(Pratani Ramakrishna) ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరమని విజయేంద్రప్రసాద్ అన్నారు. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్ గా నంది అవార్డ్ కేటాయిస్తే బావుంటుందన్నది చెప్పారు. అలాగే తెలంగాణలో అద్భుతమైన టూరింగ్ స్పార్ట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని బేస్ చేసుకుని 90 శాతం అక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్ తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే మరిన్ని చిత్రాలు రూపొందడంతోపాటు తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు.
ప్రతాని రామకృష్ణ గారు ఇస్తోన్న ఈ అవార్డ్స్ కి ప్రభుత్వం తరఫునుంచి కచ్చితంగా మంచి సపోర్ట్ లభిస్తుందని టియస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఈ అవార్డ్స్ సక్సెస్ ఫుల్ గా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో ప్రస్తుతం టూరిజం స్పార్ట్స్ పెరిగాయని గుర్తు చేశారు. విజయేంద్రప్రసాద్ గారు చెప్పిన విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ 2021, 22 సంవత్సరాలకుగానూ ఇవ్వడం జరుగుతుందని డా.ప్రతాని రామకృష్ణ గౌడ్(Pratani Ramakrishna Goud) చెప్పారు. దీనికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసి అర్హులకు ఈ అవార్డ్స్ ఇవ్వనున్నామని వెల్లడించారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2021, 22 సంవత్సరంలో విడుదలైన చిత్రాలు నిర్వహకులు అప్లయ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రముఖులతో ఏర్పాటు అయిన కమిటీ మెంబర్స్ ఆ చిత్రాలను చూసి అర్హులు అనుకున్న వారికి అవార్డ్స్ ఇస్తారని తెలిపారు. దుబాయ్ ప్రిన్స్ డేట్ తీసుకుని త్వరలో అవార్డ్స్ డేట్ అధికారికంగా ప్రకటిస్తామని ఆయన అన్నారు.
కొన్నేళ్లుగా నంది అవార్డ్స్ ఇవ్వడం లేదని అనుకుంటున్న క్రమంలో ప్రతాని గారు ముందుకొచ్చి కళాకారులను పోత్సహించడానికి మళ్లీ టీఎఫ్‌సీసీ(TFCC) నంది అవార్డ్స్ ఇవ్వడం అభినందించాల్సిన విషయమని తెలుగు ఫిలించాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ చెప్పారు. అవార్డ్స్ అనేవి ఎప్పుడూ మనలో ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఇటీవల తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో మనకు ఎంతో గౌరవం పెరిగిందని అన్నారు. మనం చేసే పనికి గుర్తింపు వస్తే అదొక ఆనందమని సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ అన్నారు. ఆ గుర్తింపు ప్రోత్సాహాన్నిఇచ్చేవి అవార్డ్స్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ ఆపివేయడం దురదృష్టకరమని అన్నారు. మళ్లీ ప్రతాని గారు నంది అవార్డ్స్ స్టార్ట్స్ చేయడం సంతోషకరమైన విషయం స్పష్టం చేశారు.