ఒడిశా(odisha)లోని కియోంజర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంంది. పెళ్లి ఊరేగింపుపై ఓ ట్రక్కు ఆకస్మాత్తుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మృతి చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. కియోంజర్ మీదుగా వెళ్లే జాతీయ రహదారి 20 సమీపంలోని సతీఘర్ సాహి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను కియోంజర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్పించారు.
పెళ్లి తర్వాత DJ సంగీతానికి నృత్యం చేస్తూ ఊరేగింపుగా వెళుతుండగా వధువు ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఉండగానే తెల్లవారుజామున 1.30 గంటల మధ్య ఓ ట్రక్ ఊరేగింపుపైకి దూసుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో వరుడి మేనల్లుడు, వారి వైపు నుంచి మరో వ్యక్తి, సతీఘర సాహికి చెందిన ముగ్గురు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆ స్థలంలో ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.