హైదరాబాద్(hyderabad)లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి(heavy rain) పలు చోట్ల పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరింది. మరోవైపు రోడ్లపై నీరు భారీగా చేరడంతో వాహనదారులు రోడ్లపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో…ఆ ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకోవైపు ఓ చిన్నారి కూడా మృత్యువాత చెందింది.
హైదరాబాద్ (Hyderabad) లో నిన్న రాత్రి నుంచి పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain) కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం భాగ్యనగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. రెండు గంటల్లోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ నేపథ్యంలో రామచంద్ర పురంలో 7.98, గచ్చిబౌలిలో 7.75, గాజుల రామారంలో 6.5, జీడిమెట్లలో 5.33 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డైంది. ఎండాకాలంలో ఇంత పెద్ద ఎత్తున వర్షం పడటం(rain record) ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 12, 2015న గతంలో రికార్డు స్థాయిలో 6.1 సెంటీమీటర్ల వాన పడినట్లు అధికారులు గుర్తు చేశారు.
జూబ్లీహిల్స్(Jubilee Hills), బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లో (SR Nagar), కూకట్ పల్లి సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచి ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. కొన్నిప్రాంతల్లో నాళాల నీరు వరదలా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాహనదారులు రోడ్లపై ప్రయాణించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు అనేక చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది.
ఈ వర్షాల నేపథ్యంలో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. రహ్మత్ నగర్ పరిధిలోని ఓంనగర్లో ఇంటి గోడకూలి ఎనిమిది నెలల చిన్నారి(child) జీవనిక(jeevanika) మృతి చెందింది. అయితే నిర్మాణంలో ఉన్న ఓ ఇల్లు పిల్లర్ పక్కన ఉన్న రేకుల ఇంటిపై పడటంతో గోడకూలి చిన్నారి మరణించింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు.