తెలంగాణ(Telangana)లో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించిన ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 3,06,42,333గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలియజేశారు. అందులో 1.53 కోట్ల మంది పురుషులు ఉండగా, 1.52 కోట్ల మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఇతరులు 2,133 మంది ఉన్నారన్నారు.
రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 2,742 మంది ఎన్నారైలు, సర్వీస్ ఓటర్లు 15వేలకు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 18 నుండి 19 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు 4,76,597 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. జనవరిలో ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 2.99 కోట్లు చేరుకుందన్నారు. ఆ తర్వాత 8 లక్షలకు పైగా ఓటర్లు తమ పేరును నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కోటి మందికి పైగా ఆ లిస్ట్ నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.
ముసాయిదాపై సెప్టెంబర్ 19న అభ్యంతరాలు, వినతులు సమర్పించవచ్చునని సీఈవో ప్రకటించారు. అర్హత ఉండి, ఓటు హక్కు లేనివారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని, అక్టోబరు 4న ఓటర్ల తుది జాబితాను వెలువరించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, అందులో కూడా అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.56 లక్షలు, అత్యల్పంగా చార్మినార్లో 2.16 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.