ATP: కనగానపల్లి మండల కేంద్రంలోని రెడ్డివారికుంట చెరువు మరమ్మత్తు పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. 2024 భారీ వర్షాలకు తెగిపోయిన ఈ చెరువుకు రూ. 86 లక్షల డీఎంఎఫ్ నిధులు కేటాయించారు. గత నెల 17న పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం జరుగుతున్న తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు.
VZM: డెంకాడ మండలం చింతలవలస పంచాయతీ జనసేన నాయకులు బూడి కృష్ణ రావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. రెల్లివలస పంచాయతీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. వీరికి భోగాపురంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నాగ మాధవి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
SKLM: పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం మండలం రాయపాడు పంచాయతీలో రూ .46 లక్షల NREGS నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
PLD: లంకెలకురపాడులో మొక్కజొన్న తోటలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,040 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
E.G: బీజేపీ ఆధ్వర్యంలో మహిళల 33% రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా రేపు సోమవారం ఉదయం 9:30 గంటలకు కొవ్వూరులో పాదయాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పేర్కొన్నారు. కొవ్వూరు బస్ స్టాండ్ సర్కిల్ నుంచి RDO కార్యాలయం వరకు జరిగే ర్యాలీని విజయవంతం చెయ్యాలని కోరారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశిధరాజు పాల్గొంటారని తెలిపారు.
AKP: అడ్డురోడ్డు జంక్షన్ రెవిన్యూ డివిజన్ వీఆర్వోల సంఘం నూతన కార్యవర్గం ఆదివారం ఏర్పాటు అయింది. అధ్యక్షుడిగా కోటవురట్లకు పీ. రమేష్, ప్రధాన కార్యదర్శిగా ఎలమంచిలి మండలానికి చెందిన సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా నూకరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎల్లపు నాయుడు, కోశాధికారిగా రమణను ఎన్నుకున్నారు.
TPT: యర్రావారిపాళెం మండలం వైసీపీ యూత్ అధ్యక్షుడు సన్నీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న చంద్రగిరి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయనను ఇంటి వద్ద పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శలో పలువురు స్థానిక నాయకులు కూడా ఉన్నారు.
ASR: జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ, అనుసంధాన రహదారుల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం జీ.మాడుగుల మండలంలో పర్యటించి, జాతీయ రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. జీ.మాడుగుల నుంచి ఉరుము జంక్షన్ వరకు, డీ.గొందూరు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో ఆదివారం ఆకస్మిక డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పట్టణ సీఐ బి. వెంకటరావు సిబ్బందితో నిర్వహించారు. పట్టణంలో ఉన్న ఎస్.వి.డి డిగ్రీ కళాశాల వద్ద ప్రతి వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజ్ చేశారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కేసులు నమోదు చేశామని సీఐ చెప్పారు.
కోనసీమ: అమలాపురం పట్టణంలో మహిపాల వీధిలో ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆదివారం స్వామివారికి లక్ష మల్లె పువ్వులతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శ్రవణ నక్షత్రం రోజున స్వామి వారిని ఆరాధించడం అత్యంత శుభప్రదమని అర్చకులు అన్నారు.
SS: ధర్మవరం నియోజకవర్గ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో రెండో విడత సైకిళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. సంస్కృతి సేవా సమితి సహకారంతో ఏప్రిల్ 14న మార్కెట్ యార్డ్‌లో ఈ వేడుక జరుగుతుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల పరిధిలోని 24 పాఠశాలలకు చెందిన 1000 మంది పదో తరగతి విద్యార్థులకు మంత్రి వీటిని అందజేస్తారు.
ATP: తాడిపత్రి సంజీవనగర్ 5వ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో మహిళల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మహిళలచే మహిళలకు మూడు బ్యాచులుగా ఈ శిక్షణ ఇస్తారు. ఆసక్తి గలవారు మారుతి స్వామి (7981942160), మధు స్వామి (6304860407) ఫోన్ నంబర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
కడప జిల్లాలో లోన్ యాప్‌లు, సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ CI చిన్న పెద్దయ్య సూచించారు. పాత బస్ స్టాండ్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అనుమానాస్పద యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దని, ఓటీపీలు పంచుకోకూడదని హెచ్చరించారు. మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రతపై కూడా అవగాహన కల్పించారు.
కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం రేపు యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KRNL: ఆస్పరిలో చెత్త సేకరణ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన రిక్షాలు పంచాయతీ కార్యాలయంలో మూలనపడి వృధాగా మారాయి. నిర్వహణ లోపంతో ఇవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు.