KRNL: పెద్దకడబూరు PHCలో మందుల కాల్చివేతపై అధికారులు స్పందించారు. ఆదోని డిప్యూటీ డీఎంహెచ్వో సత్యవతి ఇవాళ స్థానిక పీహెచ్సీని సందర్శించారు. మందుల కాల్చివేత ఘటనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఆసుపత్రిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
TPT: నారాయణవనం మండలంలో ఎండలు పెరిగాయి. ఈనేపథ్యంలో పాలమంగళం దక్షిణ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాలని పంచాయతీ అభివృద్ధి అధికారి ఆనంద్ కోరారు.
NLR: బుచ్చి పట్టణం ఖాజా నగర్ 7 వార్డులో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి పర్యటించారు. ధ్వంసమైన డ్రైనేజీ, అమృత్ 2.0 పథకం కింద పైప్ లైన్ ఏర్పాటుకు రోడ్లను గుంతల మయం చేసి పూడ్చలేదని ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
KDP: రాజంపేటలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి తాగునీరు, విద్యుత్, రోడ్లు, పింఛన్లు, భూ వివాదాలు వంటి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులతో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ATP: అనంతపురం ఆర్డీటీ సేవల కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సంస్థ ప్రతినిధులు మాంచో ఫెర్రర్, విశాలా ఫెర్రర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆర్డీటీ విశిష్ట సేవలు అందిస్తోందని ఎంపీ కొనియాడారు. ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.
E.G: కొవ్వూరులోని టీడీపీ కార్యాలయంలో MLA ముప్పిడి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ప్రజలు డ్రైనేజీ, త్రాగునీరు, పింఛన్లు, రోడ్లు, తదితర సమస్యలు తెలుపుతూ 25 వినతి పత్రాలను అందించారు. పలు సమస్యల తక్షణ పరిష్కారం కొరకు సంబందిత అధికారులతో MLA ఫోన్లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
బాటసారులు దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదపడతాయని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు DCCB ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఇవాళ సామర్లకోట పట్టణ పరిధి లారీ స్టాండ్ వద్ద మైత్రి యువజన సేవా సంఘం వారు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వేసవికాలంలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు.
W.G: జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లలో తణుకు మున్సిపాలిటీ 81 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. మొత్తం రూ.16.46 కోట్లకు గాను రూ.13.34 కోట్లు వసూలయ్యాయని, పాలకొల్లు రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ కల్పిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ ఫోన్- ఇన్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. 6వ డివిజన్లోని స్మశాన వాటికను పరిశీలించారు. రోడ్డుపైనే అంత్యక్రియల ముందు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు గుర్తించి, స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించారు. ఇకపై స్మశాన వాటిక లోపలే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
PLD: జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా నరసరావుపేట టౌన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్తదానం మహాదానం అని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత పెద్దఎత్తున పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని ఆమె తెలిపారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు.
ప్రకాశం: కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి హైస్కూల్లో శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “8వ పోషణ పక్వాడా–2026” కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ పార్వతి నిర్వహించారు. గర్భధారణ నుంచి 3 సంవత్సరాల వరకు పిల్లల మెదడు అభివృద్ధికి తల్లి పోషకాహారం, తల్లి పాలు, పరస్పర చర్యలు కీలకమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ATP: గుత్తి మండలం యంగన్నపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను ఇవాళ ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ తనిఖీ చేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీల హాజరు పట్టికను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఫేస్ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ యాప్ ద్వారా గ్రామాల్లో ఉపాధి హామీ పనులలో అవినీతిని అరికట్టవచ్చన్నారు.
TPT: శ్రీకాళహస్తి గుడికి అనుబంధంగా ఉన్న కైలాస సదన్, గంగా సదన్ వసతి గృహాలను ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గురువారం సందర్శించారు. భక్తులకు అందుతున్న సేవలు, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
GNTR: మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంత్రి లోకేష్ చొరవతో దుగ్గిరాల మండలం చిలువూరు–తుమ్మపూడి గ్రామాల మధ్య డ్రైన్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. రూ.1.20 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి నిధుల ద్వారా మంజూరయ్యాయని నేతలు తెలిపారు.
TPT: ఓ పత్రికాధినేత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సూళ్లూరుపేట పోలీసులకు వైసీపీ నాయకులు ఫిర్యా దు చేశారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి బహిరంగ క్షమాపణ చెప్పించలని డిమాండ్ చేశారు. జర్నలిజం పేరుతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్సై అజయ్ కుమార్ను కోరారు.