CTR: వెదురుకుప్పం మండలం తార్లబైలు సర్వే నం.231లోని 98 ఎకరాల ప్రభుత్వ భూమిపై కబ్జా ప్రమాదం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చర్యలు తీసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పర్యవేక్షణ కట్టుదిట్టం చేశారు. ఆక్రమణకు యత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు త్వరగా స్పందించడంపై గ్రామస్థులు అభినందించారు.
SKLM: సోంపేటలోని ఉద్దానం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ‘ఉద్దానం కేర్ హెల్త్ క్లినిక్’ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బి. అశోక్ ప్రారంభించారు. ఆయన క్లినిక్‌లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న నేపథ్యంలో, ఈ క్లినిక్ స్థానికులకు ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
VZM: గజపతినగరం మండలం పురిటిపెంట న్యూ కాలనీలో గల దేవర కిరణ్ ఇంటి వద్ద ఆదివారం ‘మన ఊరు-మన జెండా’ నిర్వహించారు. ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల్ గోపి ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ పిలుపు మేరకు పార్టీ పతాకాన్ని ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర కిరణ్ ఆవిష్కరించారు. జిల్లా ఓబీసీ అధ్యక్షులు దొగ్గ దేవుడు బాబు పాల్గొన్నారు.
PLD: దాచేపల్లి (M) సారంగపల్లి అగ్రహారంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ వైర్లను దొంగతనం చేశారు. గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లే లక్ష్యంగా దుండగులు ఈ పని చేసినట్లు స్థానికులు, రైతులు చెప్పుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విదేశీ పర్యటనకు ఎట్టకేలకు కోర్టు షరతులతో అనుమతి లభించింది. మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టు జామీను, పర్యటన పూర్తి వివరాలు ముందుగా సమర్పించాలని ఆదేశించింది. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఆన్‌లో ఉంచి, జూలై 15లోపు భారత్‌కు రావాలని సూచించింది. తిరిగి వచ్చిన వారం రోజుల్లో కోర్టులో హాజరు కావాలని పేర్కొంది.
BPT: పిట్టలవానిపాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని స్థానికులు అంటున్నారు. పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని, ఇసుక వాహనాలు అతి వేగంతో, పరిమితికి మించిన లోడుతో వెళ్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కడప నగరంలో గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ATP: ఐపీఎల్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లపై నిఘా పెంచినట్లు SP జగదీష్ హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రూపాల్లో బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సైబర్ బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తున్నాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారిపై కేసులు నమోదు చేసి, ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని పేర్కొన్నారు.
ప్రకాశం: 2010కి ముందు నియమితులైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని APTF రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల డిమాండ్ చేశారు. ఆదివారం మార్కాపురంలోని తమ కార్యాలయంలో మాట్లాడుతూ.. KGBV ఉపాధ్యాయులకు MTS వర్తింపజేయాలని, కరోనా సమయంలో మరణించిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
NLR: అల్లూరు మండలం ఇస్కపల్లి (చంద్రబాబు నగర్)లో కాపుల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. మత్స్యకారుల ఆహ్వానం మేరకు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కాపులను అభినందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
NDL: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది ఈశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మహానందిలో నూతనంగా నిర్మించిన కమ్మవారి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంచి వాతావరణంలో భవనం నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు పడమర వీధిలో ఆదివారం ప్రజల సౌకర్యార్థం జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ రీజినల్ జోనల్ ఆర్టీసీ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. చలివేంద్రం ప్రారంభం అనంతరం పలువురికి మజ్జిగను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రజా సేవలో జనసేన పార్టీ ముందుంటుందని జనసైనికులను అభినందించారు.
VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో ఆదివారం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునరావు, భక్తులు పాల్గొన్నారు.
కర్నూలు: ఐపీఎల్ బెట్టింగ్, మట్కా, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణపై ముఖ్య సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జూద కార్యకలాపాలు కట్టడి చేయాలన్నారు.