BPT: అద్దంకి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో పాలిసెట్ పరీక్షకు ఈనెల 6 నుంచి 23 వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ షేక్ సాహిల్ బాబు తెలిపారు. పరీక్ష ఈనెల 25న జరగనుంది. విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కూడా అందించబడుతుంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
CTR: చిత్తూరు జిల్లా ప్రజలు ఆన్‌లైన్ ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడి సూచించారు. ఫేక్ లింకులు, QR కోడ్లు, OTP మోసాల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని హెచ్చరించారు. OTP, PIN వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
GNTR: తెనాలి ఆటోనగర్‌లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన శనివారం ఏర్పాటు చేశారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు ఉన్న విగ్రహాలను ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించగా ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, నన్నపనేని రాజకుమారి, వీరవల్లి మురళి వీటిని ప్రారంభించారు.
NDL: పుట్టిన ప్రతి బిడ్డకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలని ఇవాళ ఎంపీ హెచ్ఐఓ హుస్సేన్ రెడ్డి తెలిపారు. మహానంది మండలం అబ్బిపురం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఏఎన్ఎం సావిత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రతి తల్లిని చైతన్యపరచి, ఒక్క చిన్నారికీ టీకా మిస్ కాకుండా చూడాలని పేర్కొన్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని నరసరంపేట సమీపంలోని గుంజనేరులో శనివారం అరుదైన కింగ్ ఫిషర్ (లకుముకి పిట్ట) దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ విషయం తెలిసిన స్థానిక యువకులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పక్షిని వీక్షించారు. తెలుపు, నీలం, ఆకుపచ్చ రంగుల కలయికతో అందంగా కనిపించే ఈ పక్షి నీటి దగ్గర ఉండి చేపలను ఆహారంగా తీసుకుంటుంది.
TPT: సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. త్రాగునీరు, కరెంట్, రోడ్లు, రెవెన్యూ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KRNL: టీడీపీ పార్టీలో భేదాభిప్రాయాలకు తావులేకుండా ప్రతీ ఒక్కరూ ఏకధాటిగా నడిచే సమయం ఆసన్నమైందని TDP రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఇవాళ చిన్నతుంబలంలో సర్పంచ్ పదవీ కాలం ముగిసిన సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వచ్చే స్థానిక ఎన్నికలే మనకు టార్గెటని అన్నారు. చిన్న చిన్న మనస్పర్దాలతో పార్టీకి దూరంగా ఉండటం తగదన్నారు.
ATP: అమరావతి విషయంలో YS జగన్ పదేపదే మాట మారుస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి విమర్శించారు. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. తొలుత అమరావతికి మద్దతు తెలిపి, ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడారని మండిపడ్డారు. రాజధానిపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. అమరావతి రైతుల పోరాటం గొప్పదని కొనియాడారు.
E.G: ఉండ్రాజవరంలో జరుగుతున్న ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి పనులను మంత్రి కందుల దుర్గేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నాణ్యత ప్రమాణాలను సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
CTR: పలమనేరు ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని వెలుగు కార్యాలయంలో 80 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు ఈ-సైకిళ్లు పంపిణీ చేసి, స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. అలాగే 499 సంఘాలకు రూ. 35.39 కోట్ల బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు.
VZM: రెవెన్యూ వసూళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను అదేశించారు. జిల్లాలో వివిధ శాఖల రెవెన్యూ వసూళ్ల పురోగతిపై శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ వసూళ్లలో లక్ష్యం పెట్టుకుని వసూళ్లు పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
GNTR: తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఈ నెల 26న కమిటీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా నామినేషన్‌ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే, కమిటీ సభ్యుడు గుండా పిచ్చయ్య కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు తాత్కాలికంగా నిలిపి వేయాల్సిందిగా 11వ అదనపు జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చినట్లు ఎన్నికల అధికారి సాధువు ప్రతాప్ తెలిపారు.
W.G: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం పాలకొల్లులో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. గాంధీబొమ్మల సెంటర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొలుత పూజలు నిర్వహించిన అనంతరం నిరసన తెలిపారు. వివాదాస్పదంగా మారిన నాయుడును వెంటనే సస్పెండ్ చేసి, టీటీడీ పవిత్రతను కాపాడాలన్నారు.
కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర 1వ డివిజన్‌లో మార్నింగ్ విజిట్ నిర్వహించి పారిశుధ్య పనులను పరిశీలించారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సిబ్బంది హాజరు పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలుపై కూడా సమీక్షించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.
అన్నమయ్య: హసనాపురం గ్రామంలోని శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, దేవుళ్లను రాజకీయాలకు లాగొద్దని వారు అన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీఎం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.