PPM: క్షయ, మలేరియా జ్వరాలు సకాలంలో గుర్తించి, వ్యాప్తి చెందకుండా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. జిల్లా క్షయ విభాగపు సిబ్బంది, మలేరియా సబ్ యూనిట్ అధికారులతో శుక్రవారం ఆరోగ్య కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సూర్య కౌశిక్ పాల్గొన్నారు.
GNTR: గుంటూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన పీజీఆర్ఎస్ దరఖాస్తులను 12 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా నివారణ చర్యలు, శుద్ధి త్రాగునీటి సరఫరా, జలవనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
KRNL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా న్యాయవాది ఎం.శివ రామచంద్ర రావు ఎంపికైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి తెలిపారు. శుక్రవారం న్యాయ సేవాసదన్‌లో కబర్థి, న్యాయ సేవాధికార కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి నియమాకం పత్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం ఆయనకు వారు అభినందనలు తెలిపారు.
KDP: ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయని పీఠాధిపతి వెంకటాద్రి స్వాములవారు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆలయ మాడ వీధులు, ఆలయ పరిసరాలను ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని షాపుల యజమానులకు సూచించారు. అదేవిధంగా మాడవీధులను శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
W.G: పైలేరియా నివారణకు దోమల నియంత్రణే ఏకైక మార్గమని DMHO గీతాబాయి స్పష్టం చేశారు. శుక్రవారం వీరవాసరం మండలం అండలూరులో నిర్వహించిన పైలేరియా నివారణోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రోగులకు అవసరమైన MMDT కిట్లను ఆమె పంపిణీ చేశారు.
BPT: రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు అమ్ముకోవాలని చేబ్రోలు మండల వ్యవసాయ అధికారిణి ప్రియదర్శిని సూచించారు. నారాకోడూరులో శుక్రవారం పెసర కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకునే రైతులు ఈకేవైసీ చేయించుకుని ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతు సేవ కేంద్రం సిబ్బంది, పాల్గొన్నారు.
AKP: వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీగా కోటవురట్ల మాజీ సర్పంచ్ బి.అనిల్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం తనకు నియామక పత్రం అందజేసినట్లు అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ASR: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పాడేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మచ్చల మంగతల్లి అన్నారు. శుక్రవారం పాడేరులో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏఎంసీ కృషి చేస్తుందన్నారు.
KDP: పులివెందులలోని స్థానిక శిల్పారామం పార్క్‌కు వెళ్లే రోడ్డులో నిన్న రాత్రి కారు ఢీకొని బాలుడు జస్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు పులివెందులకి చెందిన శ్రీనివాసులు ఇటుకల బట్టిలో పని చేస్తున్నాడు. జస్వంత్‌ను ఇటుకల బట్టీ వద్దకు రమ్మని కోరగా అక్కడికి వస్తుండగా కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే జస్వంత్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
SKLM: పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీకాకుళం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. రూ.2 కోట్లతో వాడాడ, అచ్చెన్న పాలెం మీదుగా ఇప్పిలి వరకు నిర్మించిన బి.టి రోడ్‌ను, వాడాడ గ్రామంలో NREGS నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్‌లను కేంద్రమంత్రి ప్రారంభించారు.
WG: ఆచంట మండలం కొడమంచిలిలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వెంకటస్వామిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఆచంట ఎస్సై కే.వెంకటరమణ తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పాలకొల్లు కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. గురువారం పోలీసులు నిందితుడి దుకాణం జేసీబీతో కూల్చి వేసిన విషయం విధితమే.
NDL: కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సునీల్ పొరాణ్ సూచించారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 36 మందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. నంద్యాల ఏఎస్పీ ఎం.జావళి పాల్గొన్నారు.
KRNL: డయాగ్నొస్టిక్ బ్లాక్‌లో రోగుల మెరుగైన సేవలను వైద్యులు అందించాలని కర్నూలు GGH సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలోని తన కార్యాలయంలో డయాగ్నొస్టిక్ వైద్యులతో సమీక్ష చేశారు. డయాగ్నొస్టిక్ బ్లాక్‌లో శాంపిల్ సేకరణ, శాంపిల్ నమూనా, రిపోర్ట్స్ ప్రదేశంలో జనాలు భారీగా గుమిగూడటం, క్యూ లేకపోవడం గుర్తించామన్నారు.
కోనసీమ: ఈ నెల 13వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తారని కలెక్టర్ మహేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. సోమవారం ఉదయం పది గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ బయోడేటాతో హాజరు కావాలని వికాస జిల్లా మేనేజర్ రమేశ్ తెలిపారు.
అన్నమయ్య: నిమ్మనపల్లె మండలంలో శుక్రవారం చింతకాయలు కోయడానికి చెట్టెక్కిన రైతు కలీల్ (58) ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గారబురుజుకు చెందిన రైతు తన గ్రామ సమీపంలోని చింత చెట్టెక్కి కాయలు కోస్తుండగా అకస్మాత్తుగా జారి కిందపడటంతో అతనికి గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.