W.G: భీమవరం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో యనమదుర్రు ట్రైన్ వంతెన కింద ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటంతో పాటు సిబ్బంది చేరుకొని మంటలను నియంత్రణలోకి తెచ్చారు. అగ్నికీలలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాపించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: పేద విద్యార్ధుల విద్యాభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి చేయూతనివ్వాలని MLC జయమంగళ వెంకటరమణ తెలిపారు. ఓ ట్రస్ట్ ఛైర్మన్ అట్లూరి భవాని ప్రసాద్ ఆర్థిక సహకారంతో మండలంలోని పులపర్రుకు చెందిన బీటెక్ విద్యార్ధిని జాహ్నవికి MLC జయమంగళ వెంకటరమణ లాప్ టాప్ బహుకరించారు. విద్యార్ధులు, గ్రామస్థులకు సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు.
SKLM: రసాయన ఎరువులు వాడకం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, సేంద్రియ వ్యవసాయమే ఆరోగ్యానికి రక్షణ అని ధరణిపుత్ర ఆర్గానిక్స్ డెవలప్మెంట్ ఫార్మర్స్ సొసైటీ ఛైర్మన్ ఉమామహేశ్వరరావు అన్నారు. నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. రసాయన రహిత వ్యవసాయం, జీవామృతం, ఘన జీవామృతం వంటి పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు.
VZM: జిల్లా పోలీసు శాఖలో డీ.సీ.ఆర్.బీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ, గుండె పోటుతో ఆకస్మికంగా మరణించిన ఎ. జగదీశ్వర రావు భౌతికకాయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సందర్శించారు. అనంతరం పూలమాల వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రూ.లక్ష కుటుంబ సభ్యులకు అర్థిక సహాయం అందించారు.
GNTR: వట్టిచెరుకూరు మండల కేంద్రంలోని అద్దంకమ్మ అమ్మవారి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించగా భక్తులు భారీగా తరలి వచ్చి దర్శనం చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
PLD: కారంపూడి మండల కేంద్రంలోని టూ టౌన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ముఖ్యమని పేర్కొంటూ.. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఆలయ సమీపంలో 5.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం భక్తుల కోసం నిత్యన్నదాన సత్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా పోలవరంలోకి ప్రవేశించిన పెద్దపులి జాడలను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. రేడియో ట్రాకింగ్ ద్వారా దాని గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలో ప్రజలు సంచరించవద్దని , పొలాల్లో పశువులు మేపే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. పెద్దపులి గమనానికి చెందిన ట్రాకింగ్ చిత్రాలను విడుదల చేశారు.
కృష్ణా: నాగాయలంకలో దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.60 లక్షలు, భక్తుల విరాళాలు రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ భూనీళా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, లిఖిత ఇన్ఫ్రా ఛైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు, శీలం అశ్విన్ కుమార్ విచ్చేసి మహోత్సవంలో భాగస్వాములయ్యారు.
SS: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ వినూత్న శ్రీకారం చుట్టారు. చోరీల నియంత్రణకు పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో వారికి సిబ్బంది కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
E.G: గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో ఉంచుకొని, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు రాజమండ్రిలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 3 కోట్ల వ్యయంతో పిండ ప్రధాన కార్యక్రమాల భవనం, రూ. 70 లక్షలతో నూనె వర్తకుల అన్నదాన సమాజం భవనం పునః నిర్మాణం పనులను దేవదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి, ఎంపీ పురందేశ్వరి కలిసి ప్రారంభించారు.
CTR: వెదురుకుప్పం మండలం తార్లబైలు సర్వే నం.231లోని 98 ఎకరాల ప్రభుత్వ భూమిపై కబ్జా ప్రమాదం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చర్యలు తీసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పర్యవేక్షణ కట్టుదిట్టం చేశారు. ఆక్రమణకు యత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు త్వరగా స్పందించడంపై గ్రామస్థులు అభినందించారు.
SKLM: సోంపేటలోని ఉద్దానం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ‘ఉద్దానం కేర్ హెల్త్ క్లినిక్’ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బి. అశోక్ ప్రారంభించారు. ఆయన క్లినిక్‌లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న నేపథ్యంలో, ఈ క్లినిక్ స్థానికులకు ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
VZM: గజపతినగరం మండలం పురిటిపెంట న్యూ కాలనీలో గల దేవర కిరణ్ ఇంటి వద్ద ఆదివారం ‘మన ఊరు-మన జెండా’ నిర్వహించారు. ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల్ గోపి ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ పిలుపు మేరకు పార్టీ పతాకాన్ని ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర కిరణ్ ఆవిష్కరించారు. జిల్లా ఓబీసీ అధ్యక్షులు దొగ్గ దేవుడు బాబు పాల్గొన్నారు.
PLD: దాచేపల్లి (M) సారంగపల్లి అగ్రహారంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ వైర్‌లను దొంగతనం చేశారు. గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లే లక్ష్యంగా దుండగులు ఈ పని చేసినట్లు స్థానికులు, రైతులు చెప్పుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.