TPT: చిన్నారులను చిన్నతనం నుంచే ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉంచాలని గూడూరు సీడీపీవో మెహబూబీ కోరారు. మంగళవారం గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తిలక్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి విద్యార్థులు ఆటపాటలపై దృష్టి సారించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.
NTR: వైశాఖ శుద్ధ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొండపై ఉన్న క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి ఎదురుగా ఉన్న పల్లకీ సేవ ప్రాంతంలో శంకరాచార్య స్వామి విగ్రహానికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం భక్తులు పూజలు చేశారు.
CTR: రొంపిచర్ల జడ్పీ బాయ్స్ హై స్కూల్‌కి చెందిన టీచర్లు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఫజులుపేటలో ఇంటింటికి వెళ్లి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించమని ఉపాధ్యాయులు అడుగుతున్నారు. పాఠశాలలో విద్యాపరంగా ఎదుగుదలకు ఉన్న వసతుల గురించి వివరిస్తూ పిల్లల నమోదుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో HM ధనలక్ష్మి, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ELR: సెల్ఫ్ ఎన్యూమరేషన్’ స్వయం నమోదు దశ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. సెన్సస్ అధికారులమంటూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు పంపి ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందన్నారు. జనగణన పేరుతో ఎవరైనా మీ బ్యాంక్ వివరాలు లేదా OTP అడిగితే ఇవ్వొద్దని అన్నారు.
ATP: ఈ నెల 25న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు మంగళవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. శనివారం ఉదయం 10:30 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన అజెండాను తయారు చేశారు. జిల్లా అధికారులు సమర్పించిన ప్రగతి నివేదికపై చర్చ, తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారన్నారు.
సత్యసాయి: కదిరి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ సీఎం వెంకటేశ్వర్ ప్రసాద్, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థినులంతా బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
TPT: మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎవరు కూడా బయట తిరగవద్దని ముఖ్యంగా చెట్ల కింద సేద తీరాలని, అలాగే కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కాచి చల్లార్చిన నీటిలో కలుపుకుని తాగాలని సూచించారు.
VZM: CM చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని గజపతినగరం మండలం ఎం. గుమడం గ్రామానికి చెందిన రిటైర్డ్ విఆర్ఓ బైరెడ్డి నారాయణ వారి కుమారులు ఉదారత చాటుకున్నారు. ఒకరోజు అన్న సమారాధన కోసం రూ. 20 వేలు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు అందజేశారు. ఇదే విధంగా ప్రతి ఏడాది ఒక రోజు విరాళం అందజేయడానికి అంగీకరించారు. TDP పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి పాల్గొన్నారు.
నెల్లూరు: బుచ్చి పట్టణంలో కమిషనర్ చినబాబు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి రోడ్లమీద చెత్త వేయకుండా డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు సూచించారు. చెత్తను ప్రతిరోజు ఎప్పటికప్పుడు తరలించారని అధికారులకు ఆదేశించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారస్తులు సహకరించాలన్నారు.
కృష్ణా: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్‌ను ఎట్టకేలకు బయటకు తీశారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద చెట్లకు నీళ్లు పోస్తున్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ లోపలే ఇరుక్కుపోయాడు. సుమారు అరగంటపాటు శ్రమించి క్రేన్ సహాయంతో బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం: దర్శి మండలం పోతవరంకు చెందిన చెల్లా పోలేరమ్మ తన భూమిని కొందరు ఆక్రమించారని కలెక్టర్ రాజబాబు దగ్గర వాపోయింది. ఈ నెల 10వ తేదీన కలెక్టర్ పల్లెనిద్రకు పోతవరం వెళ్ళారు. ఆ మహిళ తన గోడును కలెక్టర్‌తో వెళ్లబోసుకుంది. కలెక్టర్ స్థానిక రెవిన్యూ అధికారులను సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. అధికారులు ఆమె పొలంకు హద్దులు ఏర్పాటు చేసి అప్పగించారు.
VZM: రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో రోడ్లు, కాలువల సమస్య గురించి ఆయనకు టౌన్ BJP ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ వివరించారు. తక్షణమే స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చి పని పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పాల్గొన్నారు.
KDP: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి స్థానిక 1-టౌన్ PS హోంగార్డ్ రఫీ నైట్ రౌండ్స్ చేస్తుండగా.. గాంధీ రోడ్డులో మందుబాబులు మద్యం బాటిళ్లతో దాడిచేసి గాయపరిచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మద్యం దుకాణాలు రాత్రి 10లోగా మూసివేయాలని జిల్లా SP విశ్వనాధ్ ఆదేశించారు.
GNTR: తెనాలి మండలం నందివెలుగులో MRO గోపాలకృష్ణ మంగళవారం ఉదయం ఆకస్మిక పర్యటన చేశారు. గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న ఆయన ఉదయాన్నే పంచాయతీ అధికారులు, సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై ఇరువైపులా ఆక్రమణలను గుర్తించి సిబ్బందిని ప్రశ్నించారు. రెండు రోజుల వ్యవధిలో మొత్తం తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.
కోనసీమ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య మంగళవారం మామిడికుదురు అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.