భారత అంతరిక్ష ప్రయోగాలకు కీలక కేంద్రంగా ఉన్న శ్రీహరికోటలోని షార్ లో వరుస ఆత్మహత్యలు అలజడి రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడం విషాదం కలిగించింది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో ఈ నెల 15, 16, 17వ తేదీల్లో రోజుకొకరు చొప్పున ముగ్గురు తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. వివిధ కారణాలతో వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన వారంతా పోలీస్ కుటుంబానికి చెందిన వారే కావడం గమనార్హం. దీంతో షార్ లో ఏం జరుగుతుందోనని భయాందోళన నెలకొంది.
ఈనెల 15వ తేదీన ఆదివారం షార్ లోని అటవీ ప్రాంతంలో కానిస్టేబుల్ చింతామణి (29) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ నెల 16వ తేదీన సోమవారం రాత్రి షార్ మొదటి గేటు వద్ద సీఐఎస్ఎఫ్ ఎస్సై వికాస్ సింగ్ (33) తన తుపాకీతో కాల్చుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
ఈనెల 17వ తేదీన మంగళవారం తెల్లవారుజామున ఎస్సై వికాస్ సింగ్ సతీమణి ప్రియాసింగ్ (27) శ్రీహరికోటలోని నర్మదా గెస్ట్ హౌస్ లో ఆత్మహత్యకు పాల్పడింది. భర్త మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతో ఆమె తన ప్రాణం తీసుకుంది.
భారత అంతరిక్ష రంగంలో శ్రీహరికోటలోని షార్ పాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. అద్భుతమైన ప్రయోగాలతో ప్రపంచ ఖ్యాతిగాంచిన షార్ లో వరుస ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకోవడం కలచివేస్తున్నది. దీనిపై షార్ ఉన్నత అధికారులు వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు, సిబ్బందికి మానసిక స్థైర్యం కల్పించాలి. ఆత్మహత్యల నివారణపై ప్రచారం చేయాలి.