వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పని చేద్దామని మంత్రులకు, పార్టీ కేడర్‌కు చెప్పిన మరుసటి రోజునే మంత్రి అంబటి రాంబాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, వైసీపీని ఇరుకున పెట్టాయి. పవన్ వ్యాఖ్యలకు తోడు బాధిత కుటుంబం కూడా అవును… మంత్రి అంబటి తమను సగం డబ్బు అడిగారని చెప్పడం గమనార్హం. ఆగస్ట్‌లో ఓ ప్రమాదంలో కొడుకును కోల్పోయిన అనాథ తల్లితండ్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ.5 లక్షలు వచ్చింది. అయితే అందులో రూ.2.5 లక్షలకు తనకు ఇవ్వాలని అంబటి డిమాండ్ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా వెలుగు చూసింది. తామే జనసేన నాయకులకు వద్దకు న్యాయం కోసం వెళ్లామని, దీంతో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని చెప్పారు. తమకు బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే బాధిత కుటుంబానికి జనసేన అండగా నిలవడంతో పాటు అంబటి రాంబాబును మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ కూడా అంబటి రాజీనామాకు డిమాండ్ చేస్తోంది. మొత్తానికి అంబటి అంశం వైసీపీని ఇరకాటంలో పడేసింది. బాధితులు కూడా ఆయన తమను డబ్బులు డిమాండ్ చేశారని గట్టిగా చెబుతున్నారు. జనసేన వాదనకు బలం చేకూరింది. తాను శవ రాజకీయాలు చేయనని అంబటి రాంబాబు చెప్పిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గట్టిగా తిప్పికొట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందిన సమయంలో శవాన్ని అక్కడే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించింది ఎవరో అందరికీ తెలుసునని, అలాంటి పార్టీలో ఉండి, శవరాజకీయాలు చేయనని అంబటి చెప్పడం హాస్యాస్పదమని చురకలు అంటిస్తున్నారు. శవరాజకీయం అంశం ద్వారా టీడీపీ నేతలు… జగన్‌కు చురకలంటించారు.
అంబటి రాంబాబుపై వచ్చిన ఆరోపణలు మామూలివి కాదని, కాబట్టి ఆయనను తప్పించాల్సిందేనని జనసేన, టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు కూడా గట్టిగా చెబుతుండటంతో మొదటి నుండి తన వెంట నిలిచిన అంబటికి జగన్ షాకిచ్చే సాహసం చేస్తారా? అనే చర్చ సాగుతోంది. అంబటిని తొలగించకుంటే జగన్ ఇమేజ్‌కు దెబ్బ అని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. మాజీ మంత్రి, టీడీపీ బీసీ లీడర్ కొల్లు రవీంద్ర మాట్లాడుతూ… అంబటిని వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలన్నారు.