»Rks Wife Shirisha And Duddu Prabhakar Were Arrested
NIA: ఆర్కే భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మావోయిస్టు అగ్రనేత భార్య శిరీష, దుడ్డు ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా శిరీషను అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ శనివారం ప్రకటించింది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. దుడ్డు ప్రభాకర్, శిరీష మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని, వీరిద్దరూ కలిసి రిక్రూమెంట్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. 2019 తిరియా ఎన్కౌంటర్లో వీరిద్దరూ పాల్గొన్నారని, మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని ఎన్ఐఏ వెల్లడించింది. జులై 28న సమావేశం ఏర్పాటు చేసుకొని భారీ కుట్ర పన్నేందుకు మావోయిస్టు కేడర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. వారు రాసిన లేఖలు, సాహిత్య పుస్తకాలతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది.