EVMs : అక్కడ ఈవీఎంలు ధ్వంసం.. ఏపీలో అక్కడక్కడా అవాంఛనీయ ఘటనలు
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో దుండగులు పోలింగ్ సెంటర్లోకి దూసుకొచ్చి ఈవీఎంలను ధ్వంసం చేశారు. మరి కొన్ని చోట్లా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి.
EVMs Destroyed : ఆంధ్రప్రదేశ్‌లో(ANDHRAPRADESH ) లోక్‌సభ, శాసన సభలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దలవాయిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు దుండగులు పోలింగ్ బూత్‌లోకి దూసుకొచ్చి ఈవీఎం మిషన్లను ధ్వంసం చేశారు.
ఈవీఎం మిషన్లు లేకపోవడంతో అక్కడ ఉన్నట్లుండి పోలింగ్ నిలిచిపోయింది. బారులు తీరిన జనం ఏం చేయాలో తెలియక గందరగోళంలో ఉన్నారు. అక్కడ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న రాజారెడ్డిని కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు అతను బలవంతంగా ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తెలిపారు.
మరో వైపు దర్శి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదంతో ఈవీఎం కిందపడి దెబ్బతింది. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో వైసీపీ కార్యకర్తలు గొడ్డళ్లు, వేట కొడవళ్లతో దాడికి దిగారు. రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లం పేటలో వైసీపీ కార్యకర్తలు ఓ టీడీపీ కార్యకర్తను చితకబాదారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైలవరంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించడంతో గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఆ రెండు గ్రూపులను చెదరగొట్టారు.