Four Maoists Killed : జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్భమ్ జిల్లా అడవుల్లో సోమవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు(Maoists) మృతి చెందారు. ఈ తర్వాత ఘటనా స్థలం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని, తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ అశుతోష్ శేఖర్ వెల్లడించారు.
వెస్ట్ సింఘ్భమ్ జిల్లాలోని అడవుల్లో ఇంకా మావోయిస్టుల(Maoists) కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గత శనివారం ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఓ భద్రతా సిబ్బంది మృతి చెందారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఆ ఘటన జరిగిన రెండు రోజులకే మళ్లీ జార్ఖండ్‌లో ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం.
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్(Jharkhand) అడవుల్లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బీఎస్ఎఫ్ 135 బెటాలియన్, ఎస్టీఎఫ్, ఐటీబీపీ 53వ బెటాలియన్, స్థానిక పోలీసులు కలిసి సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. శనివారం జరిగిన ఎన్కౌంటర్ అయితే దాదాపుగా రెండు గంటల పాటు జరిగింది. చివరికి భద్రతా దళాలను తాళలేక పలువురు మావోయిస్టులు దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని గాలింపు చర్యల్ని మరింత ముమ్మరం చేశారు.