కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం కలిగింది. వరసగా రెండు ఘటనలలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో… ఆయన కుప్పం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. సభలు, రోడ్ షోల నిర్వహణపై ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉత్తర్వుల ఆధారంగా చంద్రబాబు పర్యటనపై పోలీసులు స్పందించారు. స్థానిక టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.
రేపటి నుంచి మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. చంద్రబాబు పర్యటించే ప్రాంతాలపై ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. చంద్రబాబు పర్యటన సమాచారం పోలీసు వర్గాలకు ముందుగానే చేరింది.
చంద్రబాబు పర్యటనకు అనుమతి తీసుకోవాలని పలమనేరు పోలీసుల నుంచి కుప్పం టిడిపి నేతలకు నోటీసు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 ప్రకారం సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల అనుమతి ఉన్న చోటనే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని పలమనేరు డిఎస్పీ నోటీసులో పేర్కొన్నారు.