»Ramoji Rao Founder Of Ramoji Film City Dies At 87 Pm Reaction
Ramoji Rao : రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి, పీఎంలతోపాటు పలువురి సంతాపం
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మృతి పట్ల దేశ రాష్ట్రపతి, ప్రధానితో పాటుగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశం ఒక టైటాన్ని కోల్పోయిందంటూ ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.
Ramoji Rao : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీ రావు శనివారం తెల్లవారుజామున 4 :50 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురు కావడంతో ఈ నెల 5న ఆయన ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం ప్రాణాలు విడిచారు. దీంతో ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
దేశ రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము రామోజీరావు(Ramoji Rao) గురించి ఈ విధంగా స్పందించారు. వినోద రంగం టైటాన్ను కోల్పోయిందన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల్ని స్థాపించిన ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడని అన్నారు. రామోజీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ(PM narendra modi) స్పందించారు. ఆయన మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందన్నారు. మీడియాకు ఆయన దార్శనికుడని తెలిపారు. ఆయన సామాన్య కుటుంబంలో జన్మించి, అసామాన్య విజయాలు సాధించిన తెలుగు వెలుగు రామోజీరావని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రామోజీ(Ramoji) మృతిపై స్పందించారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను పెంచిన వ్యక్తి ఆయన అని అన్నారు. పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన వ్యక్తి అని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, నటులు బాలకృష్ణ, చిరంజీవి, రజనీకాంత్, రవితేజ, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, నరేష్, జూనియర్ ఎన్టీఆర్, కేటీఆర్, సంగీత దర్శకుడు కోటి, ఎస్వీ కృష్ణా రెడ్డి, చుక్కారామయ్య, జానారెడ్డి, అనురాగ్ ఠాకూర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి ఎంతో మంది ప్రముఖులు రామోజీ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.