అర్ధ శతాబ్దం పాటు అక్షరాలతో వార్తా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన శక్తి.... తెలుగు వాజ్ఞ్మయానికి కొమ్ముకాసిన వ్యక్తి....
వ్యసస్థగా మారి, ప్రపంచం నలుదిక్కులా దిక్కులు పిక్కటిల్లే నినదించిన ఒక శంఖరావం....
అర్ధ శతాబ్దం పాటు అక్షరాలతో వార్తా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన శక్తి….
తెలుగు వాజ్ఞ్మయానికి కొమ్ముకాసిన వ్యక్తి….
వ్యసస్థగా మారి, ప్రపంచం నలుదిక్కులా దిక్కులు పిక్కటిల్లే నినదించిన ఒక శంఖరావం….
రాజకీయ యవనికపైన తనదైన వ్యాస పాశుపతాస్త్రాలను సంధించిన ఒక విలుకాడు…
సంగీత సాహిత్య పరిభ్రమణలో తెలుగువారికి తన ఇంపుసొంపారు షడ్రసోపేతమైన విందువినోదాలు అందించిన ఒక నెచ్చెలికాడు….
చెంతకుకూడా చేరలేనంత అక్షర అంతస్తులను నిర్మించుకున్న ఒక బహుదూరపు బాటసారి ….
ఈ రోజు లేరంటే వార్తా ప్రపంచం మూగబోయి….పత్రికా వ్యవస్థ వివ్వెరపోయి, అక్షరాలనే నమ్ముకుని, పత్రికా ప్రపంచపు దివిటీలను మోసుకెళ్ళే అక్షరకార్మికులు రోదించే….పరిస్థితి ఎదురవుతుందని ఈ ప్రపంచలో ఎవ్వరూ ఊహించి వుండరు.
కానీ అది నిజం…..ఈ రోజు మళ్ళీ రాదు.
మరోసారి అక్షరాలు ఏడవలేవు….
కాలములు కన్నీరు పెట్టలేవు…
.తుప్పు పట్టిన యంత్రాలను మెరుగపెట్టి,…మబ్బేసిన అక్షరస్వాతంత్ర్యాన్ని జిలుగుపెట్టి….ప్రతీ కలాన్ని పదునుదేల్చి, చివరిగా మొనదేలిన మొనగాడు…గడిచిన యాభై ఏళ్ళలో ఒక్కడే ఒక్కడు……ఆయనే రామోజీరావు.
తెలుగు నేలకు…తన ప్రవేశంతో వార్తా ప్రాయోపవేశం చేసి, ఎదురుదెబ్బలకు బెదరకుండా, వెరపులేకుండా మందడుగు తప్ప, మరో మార్గం తెలియని, తెలుసుకోవడానికి ఇష్టపడని విశృంఖలంగా విరుచుకుపడ్డ విప్లవకారుడు…
ప్రతీ అడుగులోనూ ప్రభంజనాలను సృష్టించి, మైలురాళ్ళ కుంభవృష్టిని కురిపించి, తన భవంతులు కాదు, పత్రికా విశ్వవిహంగాన్ని ఆకాశహర్మ్యాలను దాటించి పృధివీమండలంలో భూకంపాలను తెప్పించిన ఒక చరిత్రకారుడు….ఒక యోధుడు…ఒక శోధకుడు…ఒక చోదకుడు…తిరిగారాని సుదూరతీరాలకు పయనమయ్యాడంటే…యావజ్జాతికి అది తీరని నష్టం. భర్తీ చేయలేని లోటు.
ఒకటా రెండా ఎన్నని చెప్పాలి…ఎంతని రాయాలి? యాభై ఏళ్ళ సమయవైశాల్యాన్ని, సమృద్ధిగా పండించిన, విశ్లేషణా సేద్యాన్ని, త్రికరణశుద్ధిగా నమ్మిన సిద్ధాంతాన్ని…..అవి గెలిచిన యుద్ధాలను, దాటిన అగడ్తలను కొన్నే కొన్ని అక్షరాలలో, ఎంతో కొంత పరిధిలో ఇమడ్చాలంటే సాధ్యమా? దుర్భేధ్యమైన కంచుకోటను ఏర్పరిచి, దుస్సాధ్యమైన దుర్గాలను దాటుకుంటూ, రాఉకీయసమీకరణాల వడగాడ్పులను తట్టుకుంటూ, తను అడుగులు వేస్తూ, తన సైన్యాన్ని పరుగులు తీయిస్తూ…తనదైన చేయూతనందిస్తూ….
భయపెట్టి, భంగపరచి, బెదరించి మరీ ఎందరికో జీవితాలను ప్రసాదించి, వారి వార్తా శిల్ససౌందర్యాన్ని అస్వాదిస్తూ….ఒక లేఖ ద్వారా,,,ఒక సందేశం ద్వారా…వారిని కర్తవ్యోన్ముఖులను చేస్తూ…తనూ రాస్తూ…విశ్వాన్ని కేవలం తన రెండు అక్షరాలతో మాత్రమే పరికిస్తూ…పరిశీలిస్తూ..పర్యవేక్షిస్తూ……ప్రతీ రోజునూ ఒక యజ్ఞంగా, ప్రతీ పూటనూ ఒక దీక్షగా మనసా, వాచా, కర్మణా పాటిస్తూ సాగిన ఆ నిరంతర యాత్ర ఒక్క క్షణంలో ముగిసిపోయిందా? ఇన్నేళ్ళ, ఇన్నాళ్ళ బృహత్తర ప్రస్థానం ఒక్కసారిగా సమసిపోయిందా?…
ఆశ్చర్యం…నిర్ఘాంతపోయే క్షణం….
రామోజీరావు…..చెరుకూరి రామోజిరావు…లేరంట…!
మళ్ళీ రారంట…..తిరిగారాని లోకాలకు వెల్ళిపోయారంట!!
ఔనా…నిజమా…….కేవలం భ్రమా….
కాదంట వాస్తవమేనంట….
తెలుగుజాతికి, తెలుగు ఖ్యాతికి వన్నె తెచ్చి, విలువనిచ్చి, వలువులు పేర్చిన తొలి నందమూరి తారకరామారావు పోతే……తెలుగుజాతి మూగబోయింది.
ఇప్పుడు రామోజీరావు పోతే….తెలుగుజాతి మూగబోలేదు…..వేలాది మంది అక్షరకార్మికుల సాక్షిగా…రోదిస్తోంది.
వార్తా ప్రపంచాన్ని ఉడికెత్తించిన ఉప్పెన ఇంకిపోతే ……..ఈ వార్తే బాధిస్తోంది. తరతరాల నీడను కోల్పోయిన ఒక తరం ……ఈ తరం దు:ఖం తెల్లారదు…ఆ బడభాగ్ని చల్లారదు.