కాపులకు రిజర్వేషన్ల విషయంలో అధికార పార్టీ పై ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శల వర్షం కురిపించారు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయించడానికి ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. నిజానికి కాపులకు రిజన్వేషన్లు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేవని ఆయన అన్నారు. ఈ విషయంలో కోర్టు కూడా ఎలాంటి అభ్యంతరాలు చూపించలేదని..కానీ ప్రభుత్వం మాత్రం కోర్టు స్టే ఇచ్చిందని చెబుతోందని మండిపడ్డారు.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు 5% రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రతిపాదించారనే ఇప్పుడు అది సీఎం జగన్ అమలు చేయడం లేదన్నారు. కాపులకు 5% రిజర్వేషన్లను కల్పించిన ఘనత చంద్రబాబు కు దక్కుతుందనే అక్కసుతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కాపులను బీసీల జాబితాలో చేర్చాలని డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తుందన్నారు రఘురామ. ప్రజా సంక్షేమం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కటి ఆలోచన చేశారని.. కాపులలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5% కేటాయించాలని నిర్ణయించారన్నారు. తాను కూడా గతంలో కాపులకు 5% రిజర్వేషన్లను అమలు చేయాలని కోరోనన్నారు.
ముఖ్యమంత్రి జగన్ కాపు కులంపై ఉన్న ద్వేషంతో ఎంత మంది చెప్పినా, ఆ కులం వారు ఎన్ని మార్లు వినతి పత్రాలను అందజేసిన ఈ రిజర్వేషన్ అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. కోర్టు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు 5% కాపులకు అమలు చేయడం పట్ల, ఇతర కులాలలోని అగ్రవర్ణ పేదలకు బాధ కలిగే అవకాశం ఉన్నా.. అగ్రవర్ణ పేదలలో 50% మంది కాపులలోనే ఉన్నారన్నారు. కాపులకు ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు 5% అమలు చేయడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదన్నారు.