బీజేపీ సీనియర్ నేత పురుందేశ్వరి బీజేపీకి రాజీనామా చేశారా..? ఇది పుకారు కాదు… స్వయంగా… పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్లు చెప్పడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాను ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో.. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పలు విషయాలు చెప్పారు. దానిలో భాగంగానే.. ఓ సందర్భంలో పురందేశ్వరి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. తాను వైఎస్సార్ సీపీ లోకి వెళ్తున్న సమయంలో… పురందేశ్వరి రాజకీయాలు వదులుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. తాను వైఎస్సార్సీపీలోకి వెళ్లిన సమయంలో బీజేపీకి రాజీనామా చేసి లెటర్ ఇచ్చారని.. అమిత్ షా వెంటనే ‘మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు’ అని చెప్పి.. ఆ లేఖను చించేశారని.. తాము అభ్యంతరం చెప్పం అన్నారన్నారు.
ఇక్కడ కూడా జగన్తో అదే చెప్పానని.. పురందేశ్వరి బీజేపీలో ఉంటే తమకేం ఇబ్బంది లేదని తనతో చెప్పారన్నారు. తన కుమారుడి కోసం వెళ్లాల్సి వచ్చిందని.. ఒకరి మీద కోపంతో అలా వెళ్లలేదన్నారు.
ఇక తాను.. రాజకీయాలకు దూరం కావడానికి కారణం కూడా ఆయన చెప్పారు. డబ్బుతో కూడిన రాజకీయాలతో విసుగు చెందానని వెంకటేశ్వరరావు కామెంట్ చేశారు. అందుకే ఇక తమ కుటుంబంలో తాను, తన కుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఇమడలేమని నిర్ణయించుకున్నామన్నారు. ప్రజాసేవ చేయాలనుకుంటే ఎటువంటి పదవులు లేకపోయినా అవకాశం ఉన్న మేరకు సొంతంగా చేస్తాను అన్నారు.