ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు. యాభై ఏళ్ల నుండి తాను రాజకీయాల్లో ఉంటున్నట్లు చెప్పారు. జగన్ వంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదన్నారు. 2024లోను మళ్లీ వైసీపీనే గెలుస్తుందని చెప్పారు. జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత గొప్ప పరిపాలన ఎన్నడూ జరగలేదన్నారు.
ప్రజలందరికీ ఉపయోగపడేలా పని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే అటవి శాఖకు మంచి పేరు రావాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత మేలు జరుగుతుందని వెల్లడించారు. పెద్దిరెడ్డి రెండు రోజుల క్రితం మాట్లాడారు. జగన్ ఆదేశిస్తే తాను చంద్రబాబుపై పోటీకి సిద్ధమని ప్రకటించారు. కుప్పంలో టీడీపీ అధినేతకు డిపాజిట్ రాదని వ్యాఖ్యానించారు. పుంగనూరులో తనపై పోటీకి చంద్రబాబు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను ఈ రెండు చోట్ల ఎక్కడైనా పోటీకి సిద్ధమన్నారు.
2009లో పుంగనూరు నండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు పెద్దిరెడ్డి. వైయస్ కేబినెట్లో పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డితో విభేదాలు వచ్చాయి. దీంతో ఆయన రాజీనామా చేశారు. 2013లో వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. చంద్రబాబు, పెద్దిరెడ్డిలది చిత్తూరు జిల్లానే.