KDP: వేంపల్లి మండలం పాములూరు ప్రభుత్వ భూమిని ఆక్రమించిన శేషారెడ్డిపై రైతు సంఘ నేతలు, CPI జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డీఆర్వో కార్యాలయంలో సోమవారం డీఆర్వో విశ్వేశ్వర నాయుడుని కలసి పిర్యాదు చేశారు. స్థానికుల సమస్యలకు చర్యలు తీసుకోకపోతే CPI ఆధ్వర్యంలో జెండాలు నాటి పేదలకు పంచే ప్రయత్నం చేస్తామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
KDP: ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి పొందిన వారు మాత్రమే దీపావళికి బాణాసంచా విక్రయాలు జరుపుకోవచ్చని సీఐ వంశీధర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతులు పొందకుండా అనధికారికంగా విక్రయాలు జరిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు పొందిన వారు తగిన జాగ్రత్త చర్యలు తప్పక పాటించాల్సి ఉంటుందన్నారు.
అన్నమయ్య: మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను యధావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. తర్వాత పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వకుండా తొలగించడం చట్ట విరుద్ధమన్నారు.
NTR: వెల్వడం గ్రామంలో, కృష్ణారావు, పడిగల శశిరేఖ, పడిగల శ్రీనివాసరావు, కొడవటి కాంతారావులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మృతుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
E.G: ఈనెల 6న కోటిపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుప్రమాదంలో దురదృష్టవశాత్తు విజయకృష్ణ (28) ప్రాణాలు కోల్పోయాడు. కాగా తల్లిదండ్రులు కూమారుడి అవయవదానానికి అంగీకరించారు. విషయం తెలుసుకున్నMLC సోము వీర్రాజు విజయ్ కృష్ణ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఈ ఉదాత్తమైన నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని, అవయవదానానికి అందరు ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు.
PLD: చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో ఇవాళ నకిలీ మద్యం నివారించాలని నిరసన చేపట్టారు. పార్టీ కార్యకర్తలు ప్రొహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, స్థానిక ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. నకిలీ మద్యం తయారీ, సరఫరాపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
PPM: కురుపాం మండలం రావాడ రామభద్రాపురం PHC వైద్య సిబ్బంది సోమవారం నల్ల బ్యాడ్జీలతో విధులుకు హజరైయ్యారు. వైద్య అధికారులు నిర్వహిస్తున్న ధర్నాకు మద్దతుగా తాము నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యామని PHC వైద్య అధికారి డాక్టర్ సుస్మిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య అధికారులు న్యాయవైన హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో వారికి మద్దతునిస్తున్నామని తెలిపారు.
KRNL: ఆదివారం కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా, అధిక సంఖ్యలో మండ పీతలు లభించాయి. ఒక్కో పీత కిలో నుంచి కిలోన్నరకు పైగా బరువున్నాయి. వీటిని స్థానిక కుంభాభిషేకం చేపల రేవుకు తరలించి విక్రయించగా, ఒక్కో పీత రూ. 1000 నుంచి రూ. 1500 వరకు ధర పలికింది. సముద్రాలు, నదీతీరాల వెంట లభించే పీతల రుచికి మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టపడతారు.
SKLM: పాతపట్నం మండల కేంద్రంలోని కళింగ వైశ్యుల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోవింద రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళింగ వైశ్యుల సంక్షేమం కోసం రూ.5,00,000 సహాయం అందజేశారు. కళింగ వైశ్యుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున స్థలాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
AKP: జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర సోమవారం అనకాపల్లి పట్టణం ఎన్టీఆర్ ఆస్పటల్ ఏరియాలో ప్రచారం చేశారు. కేంద్రం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకురావడంతో వస్తువుల రేట్లు తగ్గాయన్నారు. దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉపసమనం లభిస్తుందన్నారు. వస్తువులు కొనుగోలు చేసే సమయంలో ధరలు తెలుసుకోవాలన్నారు.
ప్రకాశం: పొదిలి సర్కిల్ సీఐగా రాజేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆదివారం బాధ్య తలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లుపై పలు ఆరోపణలు ఉండడంతో ఈ బదిలీ చేసినట్లు సమాచారం. సీఐ రాజేష్ మాట్లాడుతూ.. పొదిలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
KKD: కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో దేవాదాయ శాఖకు చెందిన శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. ఆలయ ఈవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో, ఇతర ఈవోల సమక్షంలో సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపు జరిగింది. ఏడు నెలల కాలానికి హుండీ ద్వారా రూ. 6,07,574 ఆదాయం సమకూరినట్లు ఈవో సూర్యనారాయణ తెలిపారు.
NDL: కుమ్మరిపేట సమీపంలో ఉన్న డంపు యార్డును తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని నందికొట్కూరు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ బేబీకి వినతి పత్రం అందజేశామన్నారు. కుమ్మరిపేట బైరెడ్డి నగర్ జంగాల పేట కాలనీల పక్కలో డంపు యార్డు ఉండడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
NDL: బనగానపల్లె పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ పోలీసులకు వారు వినతి పత్రాన్ని అందజేశారు.
NDL: శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఛైర్మన్ రమేశ్ నాయుడితో పాటు 16మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతోనే వారు దూరంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.