కడప: జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు శుక్రవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున, పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
NLR: పల్లిపాడులోని డైట్‌లో PARAKH రాష్ట్రీయ సర్వేక్షణ వర్క్ షాప్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్బంగా డీఈవో డాక్టర్ ఆర్.బాలాజీ రావు మాట్లాడుతూ.. విద్యా విధానాల్లో జరుగుతున్న మార్పులు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 38 మండలాల MEO, HMలు హాజరయ్యారు.
ATP: అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ELR: చింతలపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు పలు అంశాలలో ఇవాళ అవగాహనను సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం ఏఎస్‌పీ సుస్మిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. రానున్న బోర్డు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలంటే సబ్జెక్టులపై పట్టు సాధించాలని, ఏవైనా సందేహాలు ఉంటే ఏమాత్రం సంకోచించకుండా ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు.
KDP: పులివెందుల పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న షాపులను బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ శుక్రవారం తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 100 చెల్లించి దరఖాస్తు ఫారం పొందవచ్చన్నారు. దరఖాస్తును 16వ తేదీన 2 గంటలలోపు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. 16వ తేదీ 2 గంటల తరువాత వేలంపాట నిర్వహిస్తామన్నారు.
PLD: రెంటచింతల హోసన్నా మందిరం వద్ద ప్రమాదం జరిగింది. దోర్నాల నుంచి గురజాల మండలానికి మొక్కజొన్న కండేలు కోయడానికి వెళ్తున్న బొలెరో అదుపుతప్పి బోల్తా పడింది. వాహనంలో ఉన్న 25 మంది కూలీలలో 22 మంది గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే గురజాల ఆసుపత్రికి తరలించారు.
PPM: గిరిజన పీజీఆర్ఎస్‌తో గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జేసీ, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక గిరిమిత్ర హాల్‌లో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 మంది గిరిజనుల నుండి అర్జీలను స్వీకరించారు.
VSP: కవయిత్రి మొల్ల జయంతిని శుక్రవారం విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జేసీ గొబ్బిళ్ల విద్యాధరి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొల్ల సాహిత్య సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
SKLM: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV టీకాల కార్యక్రమాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ .ఈశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. బాలికలకు భవిష్యత్‌లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బారినపడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ టీకాలను ఉచితంగా అందిస్తుందని అన్నారు. 15 ఏళ్లలోపు బాలికలు HPV టీకాను వేయించుకోవాలని ఆయన సూచించారు.
WG: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో శుక్రవారం ‘ఫ్రైడే – డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మీ, మేల్ అసిస్టెంట్ నాగ భూషణం, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని, వ్యర్థాలను తొలగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
PLD: వినుకొండ పట్టణంలో ఆరు గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో శుక్రవారం తహసీల్దార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గృహ వినియోగ గ్యాస్ సరఫరాకు సంబంధించిన ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రత్యేకంగా హాస్టల్స్, హాస్పిటల్స్ ,ICDS కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ సరఫరా నిలిచకుండా చూడాలని కోరారు.
గుంటూరు GGHలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్వర్ పని చేయడం లేదని, అందుకే పత్రాలు అందించలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు.
AKP: భూ వివాదాలపై కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదుల మేరకు చినబొడ్డేపల్లి గ్రామానికి చెందిన భూ సమస్యపై చర్చించారు. ఇరువర్గాలు ఒక అంగీకారానికి రాకపోవడంతో వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తిరుమల బాబు, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ప్రకాశం: కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో నిర్వహించనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కొండపి ఎస్సై, దేవస్థాన ఈవో కలిసి ఉత్సవ ప్రాంగణాన్ని పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. తిరునాళ్ల సమయంలో శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉండాలన్నారు.