నంద్యాల: చేసిన అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం డ్యామ్ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తిని సున్నిపెంట పోలీసులు కాపాడారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం జూలకల్లు గ్రామానికి చెందిన శ్రీనివాసులు రూ.95 లక్షల అప్పు చేశాడు. అప్పు తీర్చలేక డ్యాములో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చాడు. సమాచారం మేరకు సున్నిపెంట పోలీసులు అతన్ని కాపాడి వారి బంధువులకు అప్పగించారు.
SKLM: కోటబొమ్మాలి నిమ్మాడలో క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు జనవరి 1న నూతన సంవత్సర వేడుకలకు నాయకులు ఎవ్వరూ కూడా పూల బొకే లు, పూలమాలలు, దుశ్శాలువ లు తీసుకురావద్దని సూచించారు. నిండు మనస్సుతో మీ అభిమానం మాకు ఉంటే చాలని, బొకేల ఖర్చుతో చదువుకొనే పేద విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలు,పెన్నులు ఇవ్వాలని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 2019 అడ్మిటెడ్ బ్యాచ్కు సంబంధించి 1, 3, 5 సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి జి. పద్మారావు విడుదల చేశారు. అభ్యర్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజును జనవరి 10వ తేదీలోపు చెల్లించాలని సూచించారు.
VZM: గుంతలు లేని నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో నగర వ్యాప్తంగా రహదారుల పాక్షిక మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య స్పష్టం చేశారు. ఆదివారం గుమ్చి, ప్రశాంతినగర్, మంగళ వీధి ప్రాంతాలలో పాక్షిక మరమ్మత్తు పనులతో పాటు మూడు లాంతర్ల ప్రధాన రహదారి బీటీ రోడ్డు పనులు గుంతలను, పాక్షిక మరమ్మత్తులను సిబ్బంది చేశారు.
ఒంగోలు: జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరం దృష్ట్యా ఒక రోజు ముందుగానే మంగళవారం జిల్లా వ్యాప్తంగా లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ రవికుమార్ తెలిపారు. జిల్లాలోని 2,85,438 మంది లబ్ధిదారులకు రూ.122.78 కోట్ల నగదు విడుదలైనట్లు వివరించారు. ఫించన్ దారులు ఈ విషయాన్ని గమనించి, అందుబాటులో ఉండాలని సూచించారు.
కృష్ణా: మహేశ్ బాబు, శ్రీలీల నటించిన హిట్ మూవీ “గుంటూరు కారం” సినిమా ఈనెల 31న రీరిలీజ్ కానుంది. నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడలోని అలంకార్, జయరాం, సాయిరాం, అప్సర థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. గుంటూరు కారం సినిమా రీరిలీజ్ అవుతుండటంతో మహేశ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ సినిమాలోని పాటలు, సీన్స్ వైరల్ చేస్తున్నారు.
VZM: ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే ఈ కుంభమేళాకు ఉమ్మడి విజయనగరం జిల్లా మీదుగా రెండు రైళ్లు నడవనున్నాయి. తిరుపతి-బనారస్-తిరుపతి (కుంభమేళా), నరసాపూర్-బనారస్-నరసాపూర్ (కుంభమేళా) స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.
VZM: నూర్పిడి యంత్రం బోల్తాపడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మహారాణి తోట సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పొలాలకు నూర్పిడి యంత్రంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తూ అది బోల్తా పడిందని సమాచారం. స్థానికులు పోలీసులకు తెలియపరిచారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఒంగోలు: సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఒంగోలు దక్షిణ బైపాస్లోని మినీ స్టేడియంలో జనవరి 13న అన్నమయ్య కీర్తనలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఆ రోజున 10 వేల మంది భక్తులు రానున్న నేపథ్యంలో వారందరికీ ప్రత్యేక ప్రవేశ పాసులు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాలు అందజేయనున్నారు.
SKLM: వీరఘట్టం యుటిఎఫ్ మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక గాయత్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 226 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నట్లు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మజ్జి పైడిరాజు తెలిపారు.
SKLM: రోడ్డు ప్రమాదంలో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ఆత్మీయులు గవిడి కౌషిక్, వడ్డి అభినవ్ కుటుంబాలను ఆదివారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో పరామర్శించారు. అధైర్యం వద్దని, అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరితో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్ ఉన్నారు.
విజయనగరం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆదివారం స్దానిక రాజీవ్ గాంధీ స్టేడియంలో అథ్లెటిక్ క్రీడాకారులను కలసి అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లాలో ఈనెల 14, 15న జరిగిన రాష్ట్ర స్థాయి అభ్లెటిక్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి ఖ్యాతి తీసుకు రావాలని క్రీడాకారులను కోరారు.
VZM: పంట నష్టం జరిగితే పరిహారం అందకే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్షునాయుడు అన్నారు. ఆదివారం బొబ్బిలిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల రేట్లు పెంచుతున్న ప్రభుత్వాలు పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదని, ప్రభుత్వ విధానాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిదని విమర్శించారు.
అన్నమయ్య: బి. కొత్తకోట పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటున్న దంపతులు నూరుల్లా, షాహినల కుమారుడు మహమ్మద్ అయాన్(8) స్థానికంగా 2వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో తల్లిదండ్రులతో కలిసి బెంగళూరు రోడ్డులోని నూనె గింజల ఫ్యాక్టరీకి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ నూనెతీసే యంత్రంలో ప్రమాదవశాత్తు చేయి పడి రెండుగా తెగిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.
SKLM: పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జనవరి 7వ తేదీ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఈఓ ఎ.గోవిందరావు తెలిపారు. ఇప్పటివరకు పదో తరగతి వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలవుతోందన్నారు. ఇప్పుడు జూనియర్ కాలేజ్ విద్యార్థులకు అమలు చేస్తుండడంతో వంట ఏజెన్సీలు, నిర్వాహకులు సహకరించాలని కోరుతున్నారు.