VSP: ప్రపంచ తెలుగు మహాసభలకు అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక లక్క బొమ్మలను పంపిస్తున్నట్లు గ్రామానికి చెందిన కళాకారుడు సంతోష్ తెలిపారు. జనవరి 3- 5 వరకు హైదరాబాద్‌లో మహాసభలు జరుగుతున్నట్లు తెలిపారు. మహాసభలకు హాజరయ్యే ప్రముఖులకు జ్ఞాపికగా అందజేసేందుకు వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలు మంగమ్మ బొమ్మలు పంపించాలని నిర్వాహకులు కోరినట్లు తెలిపారు.
TPT: శ్రీకాళహస్తిలో జనవరి మూడో తేదీన జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. సోమవారం పాఠశాల స్థాయి, మంగళవారం మండల స్థాయి పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను తిలకించవచ్చన్నారు.
VSP: రాంబిల్లి మండలం గోవిందపాలెం గ్రామ శివారు ప్రాంతంలో గల జీడి తోటల్లో ఆదివారం పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై నాగేంద్ర తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సోమవారం వీరిని కోర్టుకు తరలిస్తామని అన్నారు.
TPT: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం స్థానిక రాస్ కేవీకేను సందర్శించనున్నట్లు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇక్కడికి చేరుకుని కేవీకే వారి కార్యక్రమాల ప్రగతిని పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను సందర్శిస్తారన్నారు. అనంతరం రైతులతో సమావేశం అవుతారని పేర్కొన్నారు.
ATP: గోరంట్ల మండలంలో ఇటీవల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ఆదివారం అరెస్ట్ చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. వారి వద్ద నుంచి 12తులాల బంగారు నగలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వీరు కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలతో పాటు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ పలు దోపిడీలకు పాల్పడినట్లు తేలిందని వెల్లడించారు.
KDP: రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా నియమితులైన కె.విజయానంద్ జిల్లాకు చెందిన వారే. రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. 1965లో జన్మించారు. అనంతపురం జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్ జనవరి 1వ తేదీన సీఎస్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు.
ATP: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సోమవారం ఉదయం 10 గంటలకు గార్లదిన్నె మండలంలో పర్యటించనున్నారు. పెనకచర్ల డ్యామ్‌లో చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి హాజరవుతారని మండల కన్వీనర్ పాండు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నేతలు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
GNTR: పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల నిర్వహణలో కచ్చితత్వం పాటించాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. కొలమానాలు తీసే కంప్యూటర్ యంత్రాల పనితీరును పరిశీలించి, సాంకేతిక సమస్యలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
SKLM: ఈ నెల 31న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం టెక్కలిలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి దివ్యాంగుల అంతా హాజరు కావాలని కోరారు.
VSP: నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా సురక్షితంగా జరుపుకోవాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సూచించారు. డిసెంబర్ 31న మద్యం తాగిన వారు క్యాబ్‌లు బుక్ చేసుకుని సురక్షితంగా ఇళ్లకు చేరాలన్నారు. ఆ రోజు రాత్రి 8గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు.
VZM: గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ ప్రకాశ్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసినదే. నిందితున్ని పోలీసులు సాలూరు కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమైండ్ విధించడంతో బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు.
ELR: కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీలు మాటలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసే వారి సమాచారాన్ని ఫోన్ నెంబర్ 9550351100 కి తెలపాలని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
NLR: కావలి రూరల్ మండలం ఆనేమడుగులో శ్రీశ్రీశ్రీ నాగూర్ మీరాస్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం దర్గాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు గంధ మహోత్సవం నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని రాళ్ళపాడులో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. వారిని కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఓ స్థలం వివాదం విషయంలో తమపై కర్రలు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని గ్రామానికి చెందిన గోగుల మాల్యాద్రి తెలిపారు.
ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడవచ్చన్నారు. ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామన్నారు.