KRNL: గోనెగండ్ల పరిధిలోని గంజిహళ్లిలో వెలసిన హజరత్ మహాత్మా బడే సాహెబ్ నెల ఉర్సు మహోత్సవం ఘనంగా జరుగుతోంది. దర్గాను దర్శించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని దర్గా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చిన్న ముదుగోలు తెలిపారు.
VZM: లక్కవరపుకోట పోలీసు స్టేషన్ పరిధి రంగారాయపురం గ్రామంలో ఐదు సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 17 సంవత్సరాల మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నామని విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. వివరాల మేరకు ఏప్రిల్ 4న రాత్రి టివీ చూసేందుకు వచ్చి, కుటుంబసభ్యులు వేరే పనుల్లో నిమగ్నమై ఉండగా నిందుతుడు నేరానికి పాల్పడ్డరన్నారు.
NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకు వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
NLR: రాపూరు మండలంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు గ్రామం వద్ద ఆటో-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడిని జోరోపల్లికి చెందిన వల్లూరు జగదీశ్గా స్థానికులు గుర్తించారు.
కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వెలగపూడి సచివాలయంలో ఆయనను కలిసి విశ్వవిద్యాలయం అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఉపకులపతి రాంజీ కోరారు.
PLD: మాచర్ల మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి శవ రాజకీయాలు మానుకోవాలని మాచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వీరాస్వామి అన్నారు. మాచర్ల మండలం పసువేములలో మామ అల్లుళ్ల మధ్య భూ వివాదంలో 4 నెలల క్రితం అల్లుడిని మామ గొడ్డలితో నరికితే ఇప్పటికీ అల్లుడు కోమాలో ఉన్నాడన్నారు. ఆ కక్ష్యతో అల్లుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులు మామను హత్య చేసి చంపారన్నారు.
NLR: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈనెల 7వ తేదీన సోమవారం మర్రిపాడు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
NLR: కావలి జీఆర్పీఎఫ్ పరిధిలోని అల్లూరు రోడ్డు పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజుల క్రితం దుండగులు రైలు సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి ప్రయాణికుల నుంచి బంగారం, నగదును దోచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శనివారం రైల్వే SP రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని రైలు ఆగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కృష్ణా: ఫోన్ కాల్ వచ్చిందని ఇంటి నుంచి బయటకి వెళ్లి మృత్యువాత పడ్డ యువకుడి మృతి కోడూరు మండలంలో కలకలం రేపింది. సాధారణ రైతు కుటుంబానికి చెందిన లక్ష్మీ వర్ధన్(22) బీటెక్ పూర్తిచేశాడు. తన స్నేహితులతో కలిసి కేటరింగ్ పనులకు వెళుతూ ఉంటాడు. కానీ అనుకోని విధంగా ఇలా మరణించి శవమై కనిపించడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
GNTR: టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త సీమ రాజాపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేమారెడ్డి పేర్కొన్నారు.
KRNL: జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలపై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. శనివారం అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిదాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని ఎస్పీ విక్రాంత్ తెలిపారు. డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు సబ్ డివిజన్ సీఐలు, ఎస్సైలు బృందాలుగా ఏర్పడి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
PLD: సత్తెనపల్లి పట్టణం శరభయ్య హై స్కూల్ గ్రౌండ్లో పోలీస్ శాఖ, బార్ అసోసియేషన్ సభ్యుల మధ్య క్రికెట్ మ్యాచ్ను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ఇలా ఆటల ద్వారా ఉద్యోగ భారం నుంచి విశ్రాంతి తీసుకుని, పరస్పర సహకారం పెరిగే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
KRNL: కర్నూలులోని అతి పురాతనమైన కేసీ కెనాల్ కాలుష్యానికి గురవుతోంది. చెత్తాచెదారం, మురికితో నిండిపోయింది. దోమలకు ఆవాసంగా మారిపోయింది. కాలువ నుంచి దుర్గంధాలు వెదజల్లుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలకు ఆవాసంగా మారిందని, దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
KDP: రాజంపేట పట్టణం బోయపాలెంకు చెందిన ప్రముఖ చిత్రకారుడు నాయిని గిరిధర్ చిత్రలేఖన రంగంలో రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్ తేజస్విని ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హస్తకళ చిత్రలేఖన ప్రదర్శనలో సుమారు 500 మంది కళాకారులు పాల్గొనగా వారిలో నాయిని గిరిధర్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.