కాకినాడ: పెద్దాపురం మండలం తొలి తిరుపతి క్షేత్రంలో శృంగారం వల్లభ స్వామి దివ్య కళ్యాణ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేపట్టినట్టు ఈవో వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు స్వామి కళ్యాణ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొంటారన్నారు.
ELR: నగరంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. చెంచుల కాలనీకి చెందిన మోరు పావని (23) డిగ్రీ చదివి ఉద్యోగానికి ప్రయత్నిస్తోంది. ఈ నెల 25న ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెప్పగా.. అతడు నిరాకరించాడు. ఈ నెల 26న యువతి ఇంటిపై నుంచి దూకింది. తల్లిదండ్రులు గుంటూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పావని తండ్రి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ప్రకాశం: టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో బస్సు కండక్టర్‌పై దాడి జరిగింది. బస్సు డోర్ వద్ద నిల్చొని ఉన్న యువకుడిని కండక్టర్ లోపలికి రావాలని మందలించినందుకు ఆగ్రహించిన యువకుడు దాడికి పాల్పడ్డాడు. కండక్టర్ వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించింది. ఉదయం 9గంటలకు కొత్తపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొంటారు.10 గంటలకు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద జరిగే టీడీపీ ఆవిర్భావ వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వాడపల్లి రథోత్సవంలో పాల్గొంటారు.
కోనసీమ: అమలాపురంలో మాంసం ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ఎండల తీవ్రతతో కోళ్ల పెంపకం తగ్గడంతో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.300 నుంచి రూ.350 వరకు పలుకుతోంది. ఫారం కోడి కిలో రూ.200, మటన్ రూ.800లుగా ఉంది. చేపలు రకాన్ని బట్టి రూ.120-130 మధ్య అమ్ముడవుతున్నాయి. అయితే ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారులంటున్నారు.
W.G: జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. నిన్న భీమవరం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ‘గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం’ అమలు తీరును ఆమె పరిశీలించారు. ఈ చట్టం అమలులో ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు.
TPT: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటగిరి పట్టణంలో ఇవాళ ఉదయం 10:15 గంటలకు పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొననున్నారు.
అన్నమయ్య: ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో గాలివీడు ఎస్సై నరసింహారెడ్డి యువతకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్‌ను వినోదంగా మాత్రమే ఆస్వాదించాలని, బెట్టింగుల మోజులో పడకూడదని సూచించారు. ఇటీవల బెట్టింగుల వల్ల యువత ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
VZM: జిల్లాలోని వివిధ మండలాల్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమ నిల్వలు చేసి పట్టుబడిన 15 మందిపై 6ఏ కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు జే.సీ. సేధు మాధవన్ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే రేషన్ కార్డులురద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను దారులకు 50% వడ్డీ రాయితీ పొందే గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమేనని కమిషనర్ హెచ్. కూర్మారావు తెలిపారు. ఆదివారం సెలవు రోజున కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. పన్నులు చెల్లించేందుకు ఇదే చివరి అవకాశం అని పేర్కొన్నారు.
AKP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రతీ టీడీపీ కార్యకర్త ఇంటిపైన ఉదయం ఎనిమిది గంటలలోపు పార్టీ జెండా ఎగరాలని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సబ్బవరంలో ఆయన మాట్లాడుతూ.. ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలన్నారు.
KDP: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ్టి కార్యక్రమాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9:30 గంటల వరకు వటపత్రశాయి అలంకారం, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్వపన తిరుమంజసం, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహ వాహనం చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
SS: జిల్లాకు చెందిన మహిళా నేతలు మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, శ్రావణి, సింధూరరెడ్డి CM చంద్రబాబు నాయుడిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ (FCRA) విదేశీ నిధుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేసిన కృషిపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు.
CTR: బంగారుపాళ్యం స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు రౌడీ షీటర్లను పిలిపించి, భవిష్యత్తులో ఎలాంటి నేర కార్యకలాపాలలో పాల్గొనకూడదని హెచ్చరించారు. సమాజ శాంతి, భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
NDL: బండి ఆత్మకూరు మండలం వెంగలరెడ్డి పేటలో శనివారం ఎస్సై జగన్మోహన్ గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సీసీ కెమెరాల ఏర్పాటు, బాల్యవివాహాల నివారణ, కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని SI హెచ్చరించారు.