NLR: యుద్ధం ఎఫెక్ట్.. జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. బుచ్చి మండలంలో బుకింగ్ చేసుకున్న రెండు రోజులకు కూడా సిలిండర్ డెలివరీ చేయడం లేదు. బ్లాక్‌లో విక్రయించుకునేందుకు డీలర్లు కొరత సృష్టిస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో సిలిండర్ అందేలా చూడాలని కోరుతున్నారు.
GNTR: సచివాలయంలో ఇవాళ, రేపు కలెక్టర్‌ల సదస్సు జరగనుంది. ఈసారి జిల్లా నుంచి ప్రత్యేక ప్రజంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థుల కోసం కొత్త ప్రతిపాదనలు రూపొందించారన్నారు. 9వ తరగతి నుంచే 10వ తరగతి సిలబస్ బోధన ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు భోజనం కూడా అందించాలన్నారు.
BPT: పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని లక్ష్యంగా జిల్లా పురపాలక సంఘం కమిషనర్ జి.రఘునాధ రెడ్డి ఇవాళ ఉదయం పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. రధం బజార్‌లోని యాక్సిస్ బ్యాంక్ రోడ్డులో జరుగుతున్న డ్రెయినేజ్ పూడిక పనులను ఆయన పరిశీలించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు ఆయన సూచించారు.
సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సువర్ణ నియమితులయ్యారు. ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ల పదవీకాలం ఈనెల 17వ తేదీతో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాలకవర్గ గడువు ముగిసిన వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక నుంచి మున్సిపల్ పాలన వ్యవహారాలన్నీ ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కొనసాగుతాయి.
TPT: దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల గుర్తింపు శిబిరం ఈనెల 16న నిర్వహించనున్నట్లు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తెలిపారు. ఎస్పీజేఎన్ఎం స్కూల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం జరుగుతుంది. వీల్ ఛైర్లు, వాకర్లు, వినికిడి యంత్రాలు, ట్రైసైకిళ్లు తదితర పరికరాలకు అర్హులను గుర్తిస్తారు. అవసరమైన పత్రాలతో హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు.
VZM: కొత్తవలస నుంచి విజయనగరం మూడో లైన్, నాల్గో లైన్ విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజును ఆయన కార్యాలయంలో మంగళవారం గ్రామస్థులు కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పెంటాజీ, త్రినాథ్, సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.
E.G: అనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేడు MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రంగంపేట మండలం సింగంపల్లి, అనపర్తి మండలం పేరా రామచంద్రపురంలో ఈ పనులు ప్రారంభించి మాట్లాడతారు. అదే విధంగా ఉదయం బిక్కవోలు మండలం కొమరిపాలెంలో జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అన్నమయ్య: మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి మెరుగుపరచడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బెస్త సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మానా చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం గాలివీడు మండలం వెలిగల్లు జలాశయంలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) పథకం కింద లైసెన్స్ పొందిన రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేశారు.
అనంతపురంలోని 8 వాహన షోరూంలపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వాహన కొనుగోలుదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో ఉప రవాణా కమిషనర్ వీర్రాజు నేతృత్వంలో నాలుగు బృందాలు తనిఖీలు చేపట్టాయి. నిబంధనల ప్రకారం ధరల పట్టిక ప్రదర్శించని కున్ హ్యుందాయ్, రిత్విక మోటార్స్, జయలక్ష్మి మారుతి షోరూంలపై చర్యలకు ఆదేశించారు.
NLR: నాయుడుపేట వద్ద హైవేపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇందుకూరుపేటకు చెందిన రాధాకృష్ణ (42) మృతిచెందారు. నిలిచి ఉన్న వాహనం నుంచి చేపలను మరో వాహనంలోకి మారుస్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాధాకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
VSP: విశాఖలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని సుమారు 64 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ ప్రక్రియ ప్రారంభమైతే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల సవరణ, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇవి పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
CTR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కమ్మినపల్లికి చెందిన భరత్ (20), శ్రీధర్ (22), గిరి పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతరకు వచ్చి మంగళవారం రాత్రి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మదనపల్లె క్రాస్ వద్ద విద్యుత్ స్తంభాన్ని అదుపుతప్పి ఢీకొన్నారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
కోనసీమ: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు “స్టాప్, వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం ముమ్మరంగా నిర్వహిస్తోంది.దీనిలో భాగంగా అమలాపురంలో మంగళవారం రాత్రి నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లను గుర్తించి, వారిని వాహనం దింపి, నీళ్లతో ముఖం కడిగించిన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
PLD: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మంగళవారం చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌ని ఆకస్మికంగా సందర్శించారు. వార్షిక తనిఖీలలో భాగంగా స్టేషన్‌కు చేరుకుని ఆయన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు స్టేషన్ ప్రాంగణాన్ని ముమ్మరంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. నేరాల సంఖ్యను తగ్గించేందుకు సిబ్బంది పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
AKP: బుచ్చియ్యపేట మండలం లోపూడి శివారు బంగారు మెట్టలో రాత్రి పేకాట శిబిరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడిలో ఐదుగురిపై కేసు నమోదు చేసి వారి నుంచి రూ.16,110, కొన్ని పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శివారులో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు అకస్మాత్తుగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు.