SKLM: ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఆశీల వసూలు కోసం బహిరంగ వేలం పాట నిర్వహించ నున్నట్లు మున్సిపల్ కమిషనర్ టి.రవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోనూ, మార్కెట్‌లోనూ రోజువారి ఆశీలు, కబేళా ఆశీల వసూలు కోసం వేలం పాట ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలంపాటలో తగిన పత్రాలు సమర్పించి పాల్గొనాలన్నారు.
VZM: ఆపదలో ఉన్న పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు స్పష్టం చేసారు. సోమవారం గరివిడిలో CMRF కింద మంజూరైన సుమారు రూ.19.13 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
SKLM: కొత్తూరు మండల కేంద్రంలోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల పై విజిలెన్స్, సివిల్ సప్లయ్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. గృహ వినియోగం కోసం ఇచ్చే ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార నిమిత్తం వాడుతున్నట్లు గుర్తించారు. ఐదు హోటళ్లలో మొత్తం 16 సిలిండర్లు స్వాధీనం చేసుకుని రూ.38,200 జరిమానా విధించినట్లు విజిలెన్స్ సీఐ సతీశ్ కుమార్ తెలిపారు.
ప్రకాశం: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఒంగోలు కోర్టు పోక్సో కేసు కింద 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. బేస్తవారిపేట మండలం పూసలపాడుకు చెందిన మోతుకూరి కోలా పిచ్చయ్య(31)పై కేసు నమోదై నేరం రుజువైంది. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. ముద్దాయికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసులను పై అధికారులు అభినందించారు.
CTR: కుప్పం ద్రవిడ వర్సిటీ వీసీగా ఆచార్య చిన్న మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ప్రభుత్వం వీసీగా నియమించింది. ద్రవిడ వర్సిటీని విద్య పరిశోధన పరిపాలన రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
VSP: మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 40-45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు, చిరునామా తెలియరాలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 93463 48929 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ELR: భీమడోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని ఎంపీడీవో పద్మావతిదేవి సోమవారం తెలిపారు. భీమడోలు ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆమె కోరారు. మండల స్థాయి అధికారులు తమ శాఖలోని అభివృద్ధి నివేదికలతో హాజరు కావాలని ఆమె కోరారు.
GNTR: ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (EDB) నూతన కార్యాలయాన్ని మంగళగిరి హైవేలోని మయూరి టెక్ పార్క్‌లో మంత్రి లోకేశ్ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు APIIC టవర్స్ నుంచి కొనసాగిన ఈ బోర్డు కార్యకలాపాలు, ఇకపై ఇక్కడి నుంచే సాగనున్నాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈడీబీ అధికారులతో మంత్రి ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు.
నెల్లూరు: నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో సర్వర్ గదిలో మంటలు చెలరేగి వైర్లు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. టికెట్ల జారీకి అంతరాయం కలగడంతో 4వ ప్లాట్‌ఫాం వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, మధ్యాహ్నానికి సేవలు పునరుద్ధరించారు.
KDP: YVUలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ నెల 19వ తేదీలోపు APPGCET – 2026కు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అడ్మీషన్స్ డైరెక్టర్ డా.లక్ష్మీప్రసాద్ తెలిపారు. డిగ్రీ పూర్తయిన వారు, చివరి సెమిస్టర్ పరీక్షలు రాయబోయే వారు వెబ్‌సైట్‌ను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు .వివరాలకు 8317532040,8106604789 నంబర్లను సంప్రదించాలన్నారు.
ప్రకాశం: దర్శి పట్టణంలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు దర్శి టీడీపీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో దర్శిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.
W.G: పాలకొల్లులో గత 50 ఏళ్లుగా శాఖా గ్రంథాలయం ఇప్పటివరకు అద్దె భవనాల్లో ఉంటున్నప్పటికీ మంచి సేవలందిస్తుండటం అభినందనీయమని ఉమ్మడి ప.గో. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు ప్రశంసించారు. ఇటీవల ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాగరాజు గ్రంథాలయాల తనిఖీలో భాగంగా సోమవారం పాలకొల్లు శాఖా గ్రంథాలయానికి వచ్చారు.
కోనసీమ: జిల్లా అమలాపురంలో సుమారు 1600 మంది నుంచి రూ.7 కోట్లు వసూలు చేసి మోసగించిన ఓ సంస్థ ఎండీకి 7 ఏళ్లు, డైరెక్టర్లకు 5 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి గందం సునీత సోమవారం తీర్పునిచ్చారు. నిందితులకు మొత్తం రూ.48.60 లక్షల జరిమానా విధించారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ యంత్రాంగాన్ని SP రాహుల్ అభినందించారు.
NDL: బేతంచర్ల మండలంలోని ఏం.పెండేకల్లులో అన్నదమ్ములపై నలుగురు దాడిచేసి గాయపరిచారని ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. గ్రామంలో ఇంటి పారు విషయంలో దాయాదుల మధ్య ఘర్షణ పడ్డారు. సయ్యద్ అబ్దుల్ రఫీ, అతని అన్న షఫీపై, శాలి ఫైల్‌మాన్ మరో ముగ్గురు దాడి చేశారని SI తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు నలుగురుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరించారు.
AKP: గర్భాశయ క్యాన్సర్ సోకకుండా HPV వ్యాక్సిన్ కాపాడుతుందని రాంబిల్లి మండలం దిమిలి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ తెలిపారు. సోమవారం దిమిలి పీహెచ్‌సీలో బాలికలకు వ్యాక్సిన్ వేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 90 రోజులు పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.